ఒకవేళ ఆదాము పాపం చేయకపోతే ఏమయ్యేది? ఒకవేళ హవ్వ అపవాది మాటలను నమ్మకుండా ఉంటే ఏమయ్యేది? ఒకవేళ ఆదాము హవ్వలు జీవ వృక్ష ఫలం తింటే ఏం జరిగేది?
ఈ ప్రశ్నలు ఊహాజనితమైనవి. ఎందుకంటే, ఇవన్నీ కూడా దేవుడు ఉద్దేశించిన సృష్టి పతనం విమోచన నూతన సృష్టి అనే దేవుని పనికి వేరుగా అడుగుతున్న ప్రశ్నలు.
మన థియాలజీ "ఏమైయుండవొచ్చు" లేదా "ఒకవేళ" అనే ప్రశ్నలపై కట్టే ప్రయత్నం చేయకూడదు. దేవుడు తన చిత్తంలో ఏం చేశాడు అనే దానిపై మాత్రమే మన థియాలజీ కట్టుకోవాలి.
దేవుడు మనిషి పతనం గురించి ముందే అవగాహన లేనివాడు కాడు. ఆయన సర్వజ్ఞాని. అందుకే ఆదాము హవ్వల పాపం దేవుణ్ణి ఆశ్చర్యపరిచి ఉండదు. ఎందుకంటే ఆయన విమోచన ప్రణాళికలో భాగంగా ఆ పతనాన్ని అనుమతించాడు. అనుమతించడం, పాపాన్ని ఆమోదించడం ఒకటిగా చూడకూడదు. ఒకవేళ ఆమోదిస్తే పాపానికి శిక్ష వేయకూడదు. కానీ దేవుడు పాపాన్ని శిక్షించాడు. ఇక్కడ దేవుని సార్వభౌమత్వం, మనిషి బాధ్యత రెండూ మనకు కనిపిస్తాయి. తన సార్వభౌమ చిత్తంలో తన ప్రణాళిక నెరవేర్చడానికి తద్వారా తన మహిమ నిమిత్తం దేవుడు పతనాన్ని అనుమతించాడు.
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనిషి చేసిన పాపాన్ని దేవుడు ఒక మంచి పనికి వాడుకున్నాడు. అదే క్రీస్తు ద్వారా రక్షణ కార్యం. క్రీస్తు ద్వారా రక్షణ ప్రణాళికను దేవుడు జగత్తు పునాదికి ముందే రచించాడు. సిలువ కార్యం ముందుగానే సిద్ధం చేశాడు. ఈ విధంగా చేయడానికి దేవుడు నిశ్చయించాడు అంటే దేవునికి మరో ప్రణాళిక లేదని అంటే Plan B లేదని మనం అర్థం చేసుకోవాలి.
'' మన దేవుడు పరలోకమందున్నాడు; ఆయన తనకిష్టమైనదంతయు చేయుచున్నాడు. '' — కీర్తన 115:3
కావున, మనము ఊహాజనిత ప్రశ్నలతో కాకుండా ఆయన తన గ్రంథంలో మనకు తెలియజేసిన ఆయన ప్రత్యక్షతను అంగీకరించాలి. ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల్లో సైతం సంపూర్ణ సత్యం మనకు దొరకదు. దేవుని చిత్తము పరిపూర్ణమైనది, ఆయన ప్రణాళిక మార్పులేనిది, ఆయన ఉద్దేశములు మంచివి. వాటిలో సంతృప్తిగా సేద తీరే క్రైస్తవులుగా ఉందాం.
రోమా 11:33-36 : ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment