మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ధనవంతుడైన యవ్వనస్తుడు “నిత్యజీవం పొందడానికి నేనేమీ చేయాలి” అని ప్రభువుని అడిగినపుడు “నీకున్నదంతా అమ్మి బీదలకివ్వు, నీవు నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది” అని క్రీస్తు చెబుతాడు.
ఇక్కడ ప్రభువు, బీదలకు ప్రధానంగా సహాయం చేయమనే ఉద్దేశంతో ఆ మాట చెప్పడం లేదు,ఆ ధనవంతుడైన యవ్వనస్తునికి గల ప్రధాన సమస్య దాన ధర్మాలు చేయకపోవడం కూడా కాదు. ధనవంతుడైన యవ్వనస్తుడు తనకున్న ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం సమస్య. స్వార్థం ఆయన సమస్య. ఆయనకున్న సంపదే ఆయన సమస్య. దేవునికి ఆ వ్యక్తికి మధ్యగల అడ్డుగోడ ఆ వ్యక్తికి గల అధిక ధనమే. అందుకే, ప్రభువు దానిని అమ్మేసి తనను వెంబడించమని ఆజ్ఞాపించాడు. ఆ ధనవంతుడైన యవ్వనస్తుడు ఆ పని చేయలేక వెళ్ళిపోయాడు.
క్రైస్తవులందరూ తమకున్న ఆస్తి మొత్తం అమ్మేసి తనను వెంబడించమని కూడా ప్రభువు ఇక్కడ చెప్పడం లేదు. ప్రభువు స్థానంలో ధనాన్ని పెట్టి, ప్రభువుని పక్కనబెట్టి స్వార్థంగా జీవించకూడదు అని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు.
మనకున్న ధనం దేవునికి మనకి మధ్య అడ్డుగోడలా నిలబడి మనం దేవుణ్ణి విడిచిపెట్టేలా చేస్తుంది. దేవుణ్ణి వెంబడించకుండా, తనని (ధనం) వెంబడించేలా చేసుకుంటుంది. ఈ లోకంలో ధనవంతునిగా చేసి, పరలోకానికి (నిత్యజీవానికి) వెళ్లకుండా చేస్తుంది.
క్రైస్తవులు ఈ లోకంలో ధనవంతులు కాకపోవచ్చు కానీ క్రీస్తు కొరకు నిస్వార్థంగా బ్రతుకుతూ, ఇతరులను సేవిస్తూ, తమ డబ్బు క్రీస్తు రాజ్యం కొరకు వెచ్చిస్తూ పరలోకంలో ధనవంతులవుతారు.
కానీ, చాలా మంది పరలోకంలో ధనవంతులవ్వడానికంటే ఇక్కడ ధనవంతులవ్వడానికి మాత్రమే ప్రయాసపడుతున్నారు. అది వ్యర్థమే అని ధనవంతుడైన సొలోమోను చెపుతున్నాడు (ప్రసంగి 2:1-11).
పౌలు కూడా ఇదే విషయాన్ని రాస్తాడు : ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి (1 తిమోతి 6:9,10).
అలాగని, అసలు ధనం సంపాదించకూడదు అని బైబిల్ చెప్పడం లేదు. అదే 1 తిమోతి 6:17-19 వచనాల్లో పౌలు ఈ మాటలు రాస్తాడు : ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికకయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనముగలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.
మన సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు మొదలైన వాటిపై మన ఖర్చు, మనతో దాదాపు సమానంగా సంపాదిస్తున్న వారితో సమానంగా ఉంటే, మనం బహుశా చాలా తక్కువ ఇస్తున్నాము. మన దాతృత్వ జీవితం మనల్ని ఇబ్బంది పెట్టకపోతే, మనం దేవునికి ఇతరులకు ఇచ్చేది చాలా తక్కువ అని నేనంటాను. మనం దాతృత్వానికి ఎక్కువ వెచ్చిస్తున్నందున, మనం కొన్నిటిని కొనాలని ఉన్నా కొనలేని స్థితిలో ఉండేలా జీవించాలి -C.S. లూయిస్
ఈ విధమైన క్రైస్తవ జీవితం జీవించుటకు ప్రభువు మనకు సహాయం చేయును గాక.
డా.శంకర్ బాబు

Comments
Post a Comment