ఈ మాటలు యేసు ప్రభువు జన సమూహమును చూసి అన్నట్లుగా 36 వ వచనం మనకు చెబుతుంది. ఎంతో మంది వ్యాధులతో, బాధలతో ఆయన దగ్గరికి వచ్చారు. వారిని సరైన విధానంలో నడిపించే నాయకులు లేరు. బహుశా, పరిసయ్యులు ప్రజల మీద పెట్టిన కఠినమైన నియమాలను కూడా ఖండిస్తూ ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నాడని కొంతమంది బైబిల్ పండితులు చెబుతారు.
గొర్రెల వలె అని వాడినప్పుడు ఆ ప్రజలు కూడా బహుశా గాయాలతో, పాపంతో ఉన్నారని క్రీస్తు ప్రస్తావిస్తున్నాడు. వారికి దేవుని రాజ్యం గురించి చెప్పే నిజమైన నాయకుల అవసరం ఉంది అని క్రీస్తు ఆనాడే చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రభువు చెబుతున్నాడు. కోతకు పనివారు కావాలి అయితే ఆ పనివారిని పంపుమని యజమానిని వేడుకోవాలి. అంటే ప్రార్థన చేయాలి.
దేవుడు మాత్రమే దయచేసే పనికి పనివారిని దేవుడే పంపాలి, మనం ప్రార్థన చేయాలి.
కేవలం ఒక ప్రాంతంలో నిలబడి అక్కడున్న జనసమూహాన్ని చూసి క్రీస్తు ఆ మాటలు చెబితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జన సమూహానికి వర్తించేలా ఇంకా ఎక్కువ పనివారు అవసరం ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడున్న సంఘాలు చేయాల్సిన ప్రార్థన : దేవా, ఎంతో మంది దేవుడంటే తెలియక నశించిపోతున్నారు. వారిని చాలా మంది తప్పుదోవ పట్టిస్తున్నారు. విస్తారమైన జన సమూహాలు నిజ దేవుని గురించి తెలియక నరకానికి వెళ్తున్నారు. పనివారిని పంపు ప్రభువా! మమ్మల్ని కూడా పని చేయించుకో ప్రభువా!
విచారకరంగా, చాలా సంఘాలు ఈ ప్రార్థన చేయట్లేదు, ఈ పనికొరకు సిద్ధపడట్లేదు. కేవలం స్వస్థత, అద్భుతాలు అంటూ నిజమైన సువార్తను పక్కనబెట్టేశారు.
దేవా, కనికరించు, సంఘాలను ఉజ్జీవించు, పనివారిని పంపు, ప్రార్థన చేయడానికి మాకు పురికొల్పు ఇవ్వు.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment