పాత నిబంధనలో దావీదు పేరు వినగానే మొదటగా తాను గొల్యాతును చంపిన విధానం, ఆ తర్వాత బత్సేబాతో చేసిన పాపం గుర్తుకువస్తుంది. దేవుని హృదయానుసారునిగా పిలవబడిన దావీదులో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కనుగోగలం. అది 2 సమూయేలు పుస్తకంలో మనం చూస్తాం.
2 సమూ 15:13,14లో ఇశ్రాయెలీయులు అభ్షాలోము వైపు ఉన్నారని తెలిసిన దావీదు, అభ్షాలోము నుండి మనం పారిపోదాము రండి అని పట్టణం విడిచి వెళ్లిపోతాడు. ఆయనతో పాటు చాలా మంది అరణ్యానికి పయనమైతారు.
2 సమూ 16లో దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమీ అనే వ్యక్తి దావీదును శపిస్తాడు (5వ). దావీదు మీద మరియు అతని సేవకుల మీద రాళ్లు రువ్వుతాడు (6వ). అంతేకాదు, నరహంతకుడా,దుర్మార్గుడా, ఛీ పో, నువ్వు నరహంతకుడవు కాబట్టే నీకు ఈ గతి పట్టింది అని చాలా తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించి దావీదును శపిస్తాడు.
కానీ, సౌలును దావీదు చంపించలేదని మనకు తెలుసు. సౌలును చంపే అవకాశం రెండు సార్లు వచ్చినా దావీదు చంపలేదు. సౌలు కొన ప్రాణంతో ఉండగా చంపినవాడిని ఉద్దేశించి "యెహోవా అభిషేకించినవానిని చంపడానికి నీవేల చెయ్యి ఎత్తావు? అని వాడిని చంపించాడు దావీదు (2 సమూ 1:14-16).
ఇక్కడ ఒక విషయం :
1. షిమీకి దావీదే సౌలును చంపించాడు అనే తప్పుడు సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని నిజనిర్ధారణ చేసుకోకుండా తొందరపడ్డాడు. అబద్దాలు పలికాడు. తీవ్రమైన పదజాలాన్ని వాడాడు.
సంగతి పూర్తిగా తెలియకుండా, సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఎవ్వరి మీదా నిందలు వేయకూడదు అని మనం నేర్చుకోవచ్చు.
షిమీ మాటలు విని అబీషైకి కోపం వచ్చి షిమీని చంపడానికి కూడా సిద్ధమయ్యాడు (2 సమూ 16:9).కానీ దావీదు మాటలను గమనించండి : వానిని శపించనివ్వండి, బహుశా దేవుడు ఇలా చేయమని ఆయనకు సెలవిచ్చాడేమో. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయాలని చూస్తుండగా ఈ వ్యక్తి ఇలా చేయడం పెద్ద ఆశ్చర్యం కాదు.యెహోవా వానికి సెలవిచ్చాడు కాబట్టి శపించనివ్వండి. ఆ శాపానికి బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడేమో అంటాడు (16:10-12).
దావీదు, సార్వభౌముడైన దేవుని కార్యమును గ్రహించాడు, దేవుడు తన సమయంలో తన కార్యాన్ని చేస్తాడని కొన్నిసార్లు శ్రమల ద్వారా కూడా పనిచేస్తాడని గ్రహించాడు. ఆ సమయంలో ప్రతీకారం తీసుకోకుండా సహనం ప్రదర్శించాడు.
ఇక్కడ మన నేర్చుకోవాల్సిన పాఠం : మన శ్రమల్లో కూడా దేవుడు సార్వభౌముడు అనే సత్యాన్ని గుర్తుచేసుకొని ప్రవర్తించడం.
ఆ తర్వాత అభ్షాలోము చనిపోవడం, దావీదు తిరిగి రాజ్యానికి రావడం గురించి మనం చదువుతాం. దావీదు అదే బహురీము దగ్గరికి వచ్చినపుడు ఇదే షిమీ దావీదు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి, నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నేను మూర్ఖించి చేసిన దోషమును మనసులో పెట్టుకోకండి, నేను పాపం చేశాను అని ప్రాధేయపడ్డాడు (19:16-20). అదే అబీషై మళ్ళీ, యెహోవా అభిషేకించిన వానిని శపించిన వీడు మరణానికి పాత్రుడు కాదా అని మళ్లీ షిమీని చంపడానికి సిద్ధమయ్యాడు. అయితే దావీదు మళ్ళీ షిమీని క్షమించాడు, నీకు మరణ శిక్ష విధింపను అని చెబుతాడు (19:22-23).
ఇక్కడ రెండు పాఠాలు : 1. షిమీ తాను చేసిన పాపం గ్రహించాడు, దావీదు దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకున్నాడు. మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశామో వారి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగడం చాలా ముఖ్యం. అది ఇంట్లో భార్యైనా,భర్తైనా, పిల్లలైనా, సంఘ సభ్యులైనా, పని ప్రదేశంలో ఎవరైనా సరే.
2.దావీదు ఇప్పుడు కూడా ప్రతీకారం తీసుకునే అవకాశం ఉండింది కానీ తనకి వ్యతిరేకంగా పాపం చేసిన షిమీని దావీదు క్షమించాడు. మనం కూడా మనకు వ్యతిరేకంగా పాపం చేసి మాటలతో ప్రవర్తనతో గాయపరిచిన వారిని వారు క్షమించమని అడిగినప్పుడు క్షమించాలి. ఎందుకంటే మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమును దేవుడే క్షమించాడు కాబట్టి. క్రీస్తు కూడా తన మీద ఉమ్మివేసిన వారిని, దూషించిన వారిని, సిలువేస్తున్న వారిని చూసి "వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు,వీరిని క్షమించండి" అని ప్రార్థన చేశాడు
క్రీస్తు క్షమాపణ విషయంలో మనకు అందరికంటే మాదిరిగా వున్నాడు, దావీదు కూడా తన జీవితంలో క్షమాపణను పాటించి మనకు పాఠం నేర్పుతున్నాడు.
ఎఫెసీ 4:32 - ఒకనియెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment