ఈ సంవత్సరం ప్రారంభంలో మా సంఘానికి ఒక తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముని అమ్మగారు క్రైస్తవురాలు. ఈ తమ్మునికి క్రైస్తవ్యం గురించి మంచి అభిప్రాయం కూడా లేదు. అమ్మ చెబుతుంటే వినేవాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఇదంతా నిజమేనా? దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఈ కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల వలన, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఈ తమ్మునితో కొన్ని రోజులు ఉండడానికి ఆ తల్లి హైదరాబాద్ వచ్చారు. మా సంఘంలో గల ఒక కుటుంబం వీరిని సంఘ సహవాసానికి ఆహ్వానించారు. తల్లి గారి ఒత్తిడితో రావడానికి ఈ తమ్ముడు ఒప్పుకున్నాడు. మొదటి రెండు వారాలు కష్టంగా కూర్చున్నాడు. నేను ఒక ఆదివారం నాడు “తమ్ముడు, క్రైస్తవ్యం గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని మాటలు కలిపాను. దేవుడు నిజమా? అసలు మీరు చెప్పేది నిజమేనా అని చాలా పారదర్శకంగా అడిగాడు. మీరు చెబుతుంది అసలు అర్థం కావట్లేదని కూడా ఒప్పుకున్నాడు. నేను కొన్ని ప్రశ్నలు తిరిగి అడిగి, కొన్ని విషయాలు చెప్పి “సత్యం తెలుసుకోవాలని ఆశ ఉంటే సరిపోదు, ఆ సత్యం గురించి పరిశోధించాలి కూడా” అని సంఘ సహవాసానికి రమ్మని ప్రోత్సహించాను. అప్పటికే సంఘంలో ఉన్న బ్రదర్స్ తనతో సువార్త పంచుకున్నారు. కొందరు వారిని ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించారు.
ఆ తమ్ముడు పెద్దగా ఇష్టం లేకపోయినా సహవాసానికి రావడం ప్రారంభించాడు. ప్రార్థన కూడికకు, పురుషుల కూడికకు వచ్చాడు. తనతో చాలా సార్లు బ్రదర్స్ మాట్లాడడం చూసి నేను “బ్రదర్స్, తమ్మునికి మాటిమాటికీ మళ్ళీ మళ్ళీ సువార్త చెప్పి ఒత్తిడి చేయకండి,ఎలాగూ సహవాసానికి వస్తున్నాడు కాబట్టి తన కోసం ప్రార్ధన చేయండి, ప్రేమ చూపించండి” అని వాట్సాప్ గ్రూపులో చెప్పాను.
ఈ క్రమంలో క్రీస్తు సువార్త అనే పుస్తకం ఇచ్చి చదవమని చెప్పాము. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం ప్రారంభించాడు. మెల్లిగా పాపం అంటే ఏమిటో, రక్షకుని అవసరత ఏమిటో తనకు అర్థమవుతూ వచ్చింది. బైబిల్ చదవడం ప్రారంభించాడు. సత్యం గురించి పరిశోధించడం ప్రారంభించాడు. ఆన్లైన్లో వివిధ వ్యాసాలు చదివాడు. సహోదరులతో కలిసినపుడు ప్రశ్నలు వేశాడు. అదే సమయంలో సంఘంగా మేము తన రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం.
ఒకరోజు తన తల్లి గారు నా దగ్గరికొచ్చి “అన్నా, మా వాడు ఇప్పుడు అప్పటిలా లేడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు అనిపిస్తుంది, బాప్తీస్మం గురించి ఆలోచించండి” అని చెప్పింది.
నేను “అక్కా, తను రక్షించబడితే దేవునికి స్తోత్రం. కానీ ఇంకాస్త ఆగుదాం, అప్పుడే నిర్ణయించలేము, మీరు ప్రార్థన చేయండి” అని చెప్పాను. ఈ క్రమంలో తన జీవితాన్ని కూడా గమనించాము. సంఘ కార్యక్రమాల్లో పాల్గొవడం, సంఘ భవనంలో ఎవరూ చెప్పకపోయినా పనులు చేయడం, పని చెప్పినపుడు విధేయత కలిగి చేయడం ఇవన్నీ కూడా పరిశీలించాము. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ తమ్మునితో సంఘ పెద్దలుగా మేము మాట్లాడాము. ఆ పిదప సంఘంలో గల ఇతర సోదరులను కూడా తనతో మాట్లాడమని చెప్పాము.
ప్రభువు కృపను బట్టి అందరూ కూడా ఈ తమ్ముడు రక్షించబడ్డాడు అనే ప్రాథమిక సమాచారం ఇచ్చారు. చివరిగా, ఆ తమ్ముడు కూడా రక్షించబడ్డాను అనే నిశ్చయతను వ్యక్తపరిచాడు.
ఇంకొన్ని రోజులు ఆగి తనకి బాప్తీస్మం యొక్క అవసరతను చెప్పి, ఆ తరగతులకు హాజరవమని ప్రోత్సహించాము. ఆ తరగతులు హాజరయ్యాడు. గత ఆదివారం సంఘము ఎదుట బాప్తీస్మంలో సాక్ష్యమిచ్చాడు.
దేవునికే మహిమ చెందును గాక. ఆయనే ఎన్నుకున్నాడు, ఆయనే తన పాపాన్ని ఒప్పించాడు, ఆయనే రక్షించాడు.
మా కళ్ల ఎదుటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని చూసి ఎంతో సంతోషించాము.
ఈ క్రమమలో నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు :
1. సంఘం కొత్తగా వచ్చేవారి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. వారిని ప్రేమతో ఆహ్వానించాలి, వారిని పలకరించి, మాట్లాడాలి.
2. మిగతా రోజుల్లో కూడా వారిని కలిసి సమయం గడపాలి, ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి.
3. ఈ క్రమంలో సువార్త చెప్పాలి.
4. కొత్త వ్యక్తి ఆ ఒకటే ఆదివారం వస్తారని చెబితే, ఆ వ్యక్తికి సువార్త పట్ల అవగాహన లేదని అనిపిస్తే, తప్పకుండా సువార్త చెప్పి ప్రోత్సహించాలి.
5. క్రమంగా ఆ వ్యక్తి సహవాసానికి వస్తుంటే, క్రమంగా తనతో మాట్లాడుతూ,ప్రేమ చూపిస్తూ ఉండాలి.
6. ఆ వ్యక్తి కోసం క్రమంగా ప్రార్థించాలి.
7. సంఘమంటే కుటుంబం, ఆ కుటుంబంలో తాను ఒక సభ్యుడని, మిగతా వారు తన కుటుంబ సభ్యులని భరోసా ఇవ్వాలి.
8. తన కష్ట సమయాల్లో అవసరమైన సూచనలను, సహాయాన్ని అందించాలి.
9. సంఘముగా ఆ వ్యక్తిని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయాలి.
10. రక్షణ దయచేసేది దేవుడే అని ఆయనకు మాత్రమే మహిమ చెందించాలి.
సువార్త చెప్పడం అనే పరిచర్య సంఘ కాపరులే కాదు, సంఘ సభ్యులు కూడా చేయాలని మర్చిపోవద్దు.
ఈ తమ్ముణ్ణి సంఘానికి ఆహ్వానించింది సభ్యులు, తనతో మాట్లాడింది కాపరులు మరియు సభ్యులు, తనని ఇంటికి ఆతిథ్యానికి పిలిచింది కాపరులు,సభ్యులు. దేవుడు సంఘము ద్వారా కూడా తాను ఎన్నుకున్న ప్రజలను రక్షిస్తాడు అనే సత్యం మరోసారి రుజువయ్యింది.
ఈ విషయం మీతో పంచుకోవడంలో ఉద్దేశ్యం, మేమేదో గొప్ప పని చేశామని జబ్బలు చరుచుకోడానికి కాదు. దేవుడే ఈ కార్యం చేశాడు అని గర్వంగా చెబుతున్నాను.
సంఘముగా ఈ బాధ్యత మీరు కూడా కలిగియున్నారని మిమ్మల్ని ప్రోత్సాహించాలని పంచుకుంటున్నాను.
దేవుడు ఇటువంటి సంఘాలుగా మన సంఘాలు ఉండడానికి సహాయం దయచేయును గాక.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment