సంఘములో విశ్వాసుల జీవితాలను కాయడానికి దేవుని చేత నియమింపబడ్డ వారే సంఘ కాపరులు (అపోస్త 20:28). సంఘ కాపరుల ప్రధానమైన పరిచర్యలు, దేవుని వాక్యం బోధించడం మరియు సంఘం కొరకు ప్రార్థించడం (అపోస్త 6:4).
కేవలం ఈ రెండు మాత్రమే కాపరులు చేయాలని ఇక్కడ అర్థం కాదు కానీ, ఇవి అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యతలు అని తెలుసుకోవాలి. ఎందుకంటే, దేవుని వాక్యం సరిగా బోధించబడితే, క్రైస్తవ జీవితాలకు చాలిన దేవుని వాక్యమే, విశ్వాసుల జీవితాలను చక్కపరుస్తుంది, సరిదిద్దుతుంది, ప్రోత్సాహపరుస్తుంది.
వాక్యం బోధించడం చాలా తేలికైన పని కూడా కాదు. ఒక వాక్యానుసారమైన ప్రసంగం సిద్ధపర్చడానికి దాదాపు 10-15గంటల సిద్ధపాటు సమయం అవసరం పడుతుంది. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, సంఘంలో జరుగుతున్న ఇతర పరిచర్యలను కూడా కాపరులు పట్టించుకుంటారు కాబట్టి, చాలా సమయం వీటికి కూడా ఖర్చు చేస్తారు. ఇవి కాకుండా విశ్వాసులతో మాట్లాడటం, ప్రార్థించడం ఇలా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎక్కువగా కష్టపడతారు. అటువంటి సంఘ కాపరులను విశ్వాసులు గౌరవించడం,వారికి విధేయత చూపడం చాలా ప్రాముఖ్యం.
పౌలు అదే మాట 1 థెస్స 5:12,13 లో “మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము” అంటాడు. ఇక్కడ సంఘ కాపరులు మరియు నాయకులు కూడా అని అర్థం చేసుకోవచ్చు.
అందుకే పేతురు కూడా 1 పేతురు 1:5 లో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి అని చెబుతాడు.
ఏ విధంగా సంఘ కాపరులను గౌరవించొచ్చు? మరియు ప్రేమను వ్యక్తపరచొచ్చు?
1. ప్రతి ఆదివారం కష్టపడి నమ్మకంగా దేవుని వాక్యమును మనకు బోధిస్తున్న పాస్టర్లను అభినందించండి. వాక్యము ద్వారా మీరు ఏ విధంగా ప్రోత్సహించబడ్డారో, సరిచేయబడ్డారో, దేవుని గురించి నేర్చుకున్న సత్యాలేమిటో చెప్పండి. ఆయన ప్రయాసను అభినందించండి.
మనం చెప్పే ఈ మాటలు ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి.
2. సంఘ కాపరుల గురించి ప్రార్థన చేయడం ద్వారా ప్రోత్సాహపరచొచ్చు. అయితే, ఈ విషయం వారి దగ్గరికి వెళ్లి “ పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ఏమైనా ప్రార్ధనా విన్నపాలు ఉన్నాయా?” అని అడగడం కూడా మంచిది. విశ్వాసులు తన గురించి క్రమంగా ప్రార్థన చేస్తున్నారు అనే విషయం తనకి గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది.
3. సంఘ కాపరులు పరిపూర్ణ వ్యక్తులు కాదని, వారు కూడా బలహీనులే అని అర్థం చేసుకొని వారి బాధ్యతల్లో, వారి పనుల్లో ఏవైనా తప్పులు దొర్లితే, ఏవైనా మర్చిపోతే క్షమించండి.
అలాగని వారు పాపం చేస్తే కూడా మాట్లాడకుండా, వారిని ప్రేమతో సరిచేయకుండా ఉండమని అర్థం చేసుకోకూడదు. తప్పకుండా పాపం సరిచేయాల్సిందే. కానీ, పాస్టర్లు తీసుకునే కొన్ని నిర్ణయాలు సరిగా పనిచేయకపోతే వారిని క్షమించి, ప్రోత్సహించండి.
4. సంఘ కాపరులు మన జీవితాలను కాసే నాయకులు కాబట్టి, జీవితంలో తీసుకునే ప్రాముఖ్యమైన నిర్ణయాలు వారితో పంచుకోండి. ఒకవేళ మన నిర్ణయాలు తప్పిపోయి మనం ఇబ్బందుల్లో పడితే, మళ్ళీ మన గురించి ప్రార్థించేది, ప్రోత్సహించేది సంఘ కాపరులే కాబట్టి ముందే వారి సలహాలు తీసుకోవడం మంచిది.
సామెతలు 11:14 - నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.
అలాగని, ప్రతి చిన్న సంగతిని, నిర్ణయాన్ని వారికి చెప్పాలని కూడా అర్థం చేసుకోకూడదు. అంతమాత్రాన క్రైస్తవ జీవితానికి మరియు సంఘానికి సంబంధించిన విషయాలు, నిర్ణయాలు చెప్పకుండా నిర్లక్ష్యం కూడా చేయకూడదు. మన గురించి ఆలోచించే, ప్రోత్సాహపరిచే నాయకులకు మన నిర్ణయాలు చెప్పడం వారిని గౌరవించడమే అని మర్చిపోకూడదు.
5. ఇతర పాస్టర్లతో మీ సంఘ నాయకులను పోల్చుకోకుండా ఉండాలి.
ఇతర సంఘ కాపరులు ఎంత మంచి బోధకులైనా, ఆ సంఘాల్లో సభ్యులు ఎందరో ఉన్నా,
ఆ వేరే సంఘ నాయకులు మనల్ని వాక్యంలో పోషించట్లేరు, మన కొరకు వారు ప్రార్థించటం లేదు, మనకేదైనా సమస్య వస్తే ఇతర సంఘ కాపరులు మన దగ్గరికి రారు, ఆ సమస్య నుండి పరిష్కారం చూపడానికి మనతో మాట్లాడరు. అసలు మన జీవితాల మీద జవాబుదారులుగా ఇతర సంఘ కాపరులు లేరు.
అలాగని ఇతర వాక్యానుసారమైన సంఘ నాయకుల ప్రసంగాలు వినకూడదని, వారి పుస్తకాలు చదవొద్దని అర్థం చేసుకోకూడదు. ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు ఎవరి దగ్గరి నుండైనా నేర్చుకోవచ్చు.
ఇక్కడ ఒక విషయం కూడా మాట్లాడుకుందాం.
సంఘ కాపరులు మరియు నాయకులు వారి బాధ్యతలను ప్రభువు కొరకే చేయాలి (1 కొరింథీ 10:31) కానీ, విశ్వాసుల నుండి గౌరవాన్ని,అభినందనలను పొందుకోవడానికి చేయకూడదు. వారు సంఘ పరిచర్యలో పడే శ్రమ దేవుని వైపు చూస్తూ మాత్రమే చేయాలి కానీ విశ్వాసుల అభినందనలు, కృతజ్ఞతలు, బహుమానాల వైపు చూస్తూ చేయకూడదు. దేవుణ్ణే సంతృప్తిగా కలిగియుండి, దేవుడు అప్పజెప్పిన బాధ్యతలు నమ్మకంగా దేవుని మహిమ కొరకు మాత్రమే చేయాలి.
విశ్వాసులుగా, గొప్ప ప్రసంగాలను బోధించేవారిని లేదా అద్భుతమైన ఆన్లైన్ బ్లాగులను వ్రాసేవారిని లేదా విజయవంతమైన పరిచర్యలను నడిపిస్తున్నవారిని గుర్తించమని పౌలు చెప్పడం లేదు.
" మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము” అంటున్నాడు.
మన సంఘములో పరిచర్య చేస్తున్న నాయకులు, మనల్ని దేవునిలో నడిపించే పని చేస్తున్న కాపరులు మన గౌరవానికి అర్హులు అంతే కాదు, తప్పు చేస్తే మనల్ని ప్రేమతో మందలించే, సరిదిద్దే సంఘ నాయకులు కూడా మన గౌరవానికి అర్హులు. కాబట్టి, మన సంఘ నాయకులను గౌరవిద్దాం, ప్రేమిద్దాం, వారి కొరకు ప్రార్ధన చేద్దాం. వారు సంతోషముతో ఈ పరిచర్య చేయడానికి సహాయ సహకారాలు అందిద్దాం.
హెబ్రీ 13:17 - మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.
- డా. శంకర్ బాబు

Comments
Post a Comment