కొన్ని రోజుల క్రితం సంఘాలుగా కలిసి క్రికెట్ ఆడాము. ఇలా ఆడటానికి గల ముఖ్య ఉద్దేశం, సంఘాలుగా కలిసి పనిచేయడానికి గల సహవాసం పెంపొందించడానికీ మరియు ప్రేమ సంబంధాలు కట్టుకోవడానికి.
ఆ రోజంతా చక్కగా క్రికెట్ ఆడటానికి దేవుడు మంచి స్థలం, వాతావరణం దయచేశాడు. మధ్య మధ్యలో వర్షం కురిసినా, మళ్ళీ ఆడేందుకు వాతావరణం చక్కగా సమకూర్చాడు.
అయితే, ఆ రోజు క్రికెట్ ఆడడం ద్వారా దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను.
1. క్రికెట్ ఆటలో జట్టులోని సభ్యులందరూ కలిసి ఆడినప్పుడే విజయం లభిస్తుంది.
మా జట్టు బౌలింగ్ చేసినపుడు చక్కగా బౌలింగ్ చేసేవారికి మాత్రమే అవకాశం ఇవ్వబడింది.
బ్యాటింగ్ చేసినపుడు మొదటగా బ్యాటింగ్ లో నైపుణ్యం కలవారికే మొదట అవకాశం ఇవ్వబడింది.
జట్టు నాయకుడు ఇతరులతో కలిసి ఎవరిని ముందుగా పంపాలి అనే నిర్ణయం చేసాడు.
అలాగని మిగతా వారు తక్కువ స్థాయి కలవారు అని అర్థం కాదు.
జట్టుకి ఎప్పుడు ఏది అవసరమో ముందు దానికి ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే అని ఇక్కడ గమనించాలి.
సంఘములో కూడా ఇదే జరుగుతుంది. సంఘము ఒక జట్టుగా చేసే పరిచర్య.
ఎవరైతే దేవుని తలాంతులు వరాలు కలిగి ఉంటారో వారికి అవకాశం ఇవ్వబడుతుంది.
అలాగని మిగతా వారు అసలు దేనికీ అవసరం లేని వారని కాదు.
మిగతా వాళ్ళు కూడా ఇది మన జట్టు కొరకే మన సంఘము కొరకే అని సంతోషపడాలి.
సంఘ క్షేమం కొరకు మొదటగా ఎవరు దేవుడిచ్చిన వరం ద్వారా వాడబడతారో సంఘ కాపరికి తెలుసు కాబట్టి ఆ విధమైన అవకాశాలు ఇస్తాడు
(1 కొరింథీ 12:6,7).
2. జట్టులో ఎవరో ఒకరు ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేసి ఇతర జట్టులోని వారిని అవుట్ చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన సంగతి. అంత మాత్రాన ఆ ఇద్దరు బౌలర్లు మాత్రమే గ్రౌండ్లో ఆడరు. వారికి ఇతర ఆటగాళ్ల సహాయం అవసరం.
తను వేసే బంతి పట్టుకోడానికి కీపర్, ఫీల్డర్లు కావాలి. ఇతర జట్టులోని ఆటగాళ్లను అవుట్ చేయడానికి ఇతరులు క్యాచ్ పట్టాలి లేదా బంతి విసిరి రన్ అవుట్ చేయాలి.
జట్టులో ఒకరిద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఎక్కువ రన్స్ కొడతారు కానీ జట్టులో ఇతరుల సహాయం లేకుండా చేయలేరు. అసలు ఒక్కడే బ్యాటింగ్ చేయలేడు.
సంఘ పరిచర్య కూడా అంతే. దేవుడు సంఘ క్షేమం కొరకు కొంత మందిని వాడుకుంటున్నపుడు ఇతరులు వారికి సహాయం చేయాలి. లేదంటే సంఘము క్షేమాభివృద్ధి చెందదు.
అది ఎంత చిన్నదైనా, పెద్దదైనా ఇతరులతో కలిసి పని చేస్తేనే అందరికీ క్షేమం. ఇక్కడ సహాయం చేసేవారి పాత్ర చాలా విలువైనది. అప్పుడే సంఘ పరిచర్య ప్రభావవంతంగా ఉంటుంది (1 కొరింథీ 14:26).
దేవుని సంఘములో కాపరులు ఆత్మీయ నాయకులుగా ఉండి సంఘమును వాక్యములో,ప్రార్థనలో నడిపిస్తుంటారు. పరిచారకులు సంఘములో గల ఇతర అడ్మినిస్ట్రేషన్ పనులు చూసుకుంటుంటారు. కానీ, సంఘ సభ్యులు వీరికి సహరించకపోతే ఏ పని జరగదు.
కాపరులు ముందుగా అందరికీ నాయకులుగా కనిపించి పరిచర్య చేస్తారు కానీ ఎవరికీ కనిపించకుండా సభ్యులు చేసే పనులు కూడా దేవుడు మెచ్చుకునేవే.
3. చివర్లో ఒక క్రికెట్ జట్టు విజయం సాధిస్తుంది. జట్టు మొత్తానికి కప్ ఇస్తారు. కేవలం ఎక్కువ వికెట్స్ తీసుకున్నవారికి, ఎక్కువ పరుగులు తీసినవారికి కాదు. అంటే జట్టు మొత్తానికి విజయం ఆపాదిస్తారు ఒకరిద్దరికి కాదు.
సంఘము అంటే దేవుని కుటుంబం. కుటుంబానికి గల ఒక లక్షణం, ఐక్యత.
క్రీస్తు తన సంఘము ఐక్యంగా ఉండాలని ప్రార్థించాడు ( యోహాను 17:11), ఆజ్ఞాపించాడు (ఎఫెసీ 4:1,2).
దేవుడు అటువంటి సంఘాలుగా మన సంఘాలు ఉండడానికి సహాయం దయచేయును గాక.
NOTE : మా సంఘమే ఆ గెలిచిన జట్టు.
- Dr. Shankar Babu

Comments
Post a Comment