యెషయా 56:7 నా మందిరము సమస్త జనులకు ప్రార్ధన మందిరమనబడును.
ఈ వచనం పాత నిబంధనలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, తన ప్రజలను వివిధ దేశముల నుండి తన దగ్గరకు పిలుచుకొని, తన మందిరంలో వారి దహన బలులను, ప్రార్థనలను అంగీకరిస్తాడనే సందర్భంలో రాయబడింది.
ఆ మందిరము సమస్త జనులకు ప్రార్ధన మందిరం అనబడుతుంది అని కూడా చెప్పబడింది. ఇదే మాటను మత్తయి 21:13లో దేవాలయంలో వ్యాపారులను వెళ్ళగొడుతూ యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రస్తావిస్తాడు.
పాత నిబంధనలో దేవుడు తన కొరకు మందిరం నిర్మించమని తన ప్రజలకు చెప్పి, ఆ మందిరంలో నివసించేవాడు.
యాజకులు, ప్రధాన యాజకులు, పాపక్షమాపణ కొరకైన బలులు ఇలా దేవుని సన్నిధిలో వివిధ పరిచర్యలు ఆ మందిరంలో జరిగేవి.
ఆ మందిరమును ప్రార్థన మందిరముగా వాక్యంలో పిలిచారు అంటే అక్కడ యెహోవా దేవుడికి ప్రాముఖ్యంగా ప్రార్థనలు కూడా అక్కడ జరిగేవి అని అర్థమవుతుంది.
కానీ, నూతన నిబంధనలో 1 కొరింథి 3:16 ప్రకారం "మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు" చెప్పబడింది.
ఇక్కడ "మీరు" అనగా కొరింథి లోని సంఘము.
ఎఫెసీ 2:21 లో "ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది". ఇక్కడ సంఘమును పరిశుద్ధమైన దేవాలయం అని ప్రస్తావించబడింది.
అనగా, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రజల సమూహమైన సంఘమును, నూతన నిబంధన దేవుని మందిరము లేదా ఆలయముగా పిలుస్తుంది.
అనగా, దేవుని మందిరం అయిన సంఘములో ప్రార్థన యొక్క ఆవశ్యకత మనం అర్థం చేసుకోవాలి.
సంఘము ప్రాముఖ్యముగా చేయవలసిన పరిచర్యలలో ఒక పరిచర్య సంఘ ప్రార్థన.
నా మందిరము సమస్త జనులకు అంటే వివిధ నేపథ్యాల నుండి వచ్చిన అన్ని రకాల ప్రజలకు లోక సంబంధ, వస్తుసంబంధ, స్వస్థత సంబంధ ఆశీర్వాదాలు ఇచ్చే మందిరం అని పిలవబడలేదు కానీ, సమస్త జనులు ప్రార్థించే ప్రార్థన మందిరం అనబడింది అని రాయబడింది.
విచారకరంగా, నేటి సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సంఘముగా కలిసి ప్రార్ధించాల్సిన సమయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఆదివారం ఆరాధన కార్యక్రమంలో కూడా సంఘ ప్రార్థనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దేవుని వాక్యమునకు ఇచ్చినంత సమయం కాకపోయినా దేవుని వాక్యంతో పాటుగా ప్రాముఖ్యమైన సంఘ ప్రార్థనకు సమయం కేటాయించడం చేయట్లేదు.
అంతేకాకుండా ఆదివారం జరిగే సంఘ ఆరాధనకు వచ్చినంత విశ్వాసులు,
ఆ వారం మధ్యలో జరిగే సంఘ ప్రార్థనకు రావట్లేదు. చాలా కారణాలు ఉండొచ్చు కానీ, మన ప్రాధాన్యతలలో సంఘ ప్రార్థన ఉన్నట్లయితే కొన్నిసార్లైనా సంఘముగా కలిసి చేసే ప్రార్థనకు రావాలని ప్రయత్నం చేస్తాము.
సంఘముగా కలిసి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైన పరిచర్య.
దేవుడు ఏమై ఉన్నాడో, వ్యక్తిగతంగా మనలను రక్షించి ఆయన కుటుంబముగా చేసిన ఆయన గొప్ప మహాత్మ్యమెట్టిదో మాటిమాటికి జ్ఞాపకం చేసుకొని సంఘముగా దేవునికి ప్రార్ధనా స్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉంది.
దేవుని సువార్తను ప్రజలకు ప్రకటించడానికి, దేవుని మాటలను పాటిస్తూ ఆయన శిష్యులను తయారు చేయడానికి, ఈ పాప లోకంలో దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి, సమాజంలో దేవుని సంఘముగా ఆయన మహిమ కొరకు బ్రతకడానికి, మన శక్తి మన జ్ఞానం చాలదు కాబట్టి సంఘముగా ఆయన మీద ఆధారపడుతూ ప్రార్థించాల్సిన అవసరం ఉంది.
ప్రశ్నలు :
1. మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం, మన బందువుల ఇంట్లో ఏదో వేడుక లేదా పనిచేసే చోట ఏదైనా ముఖ్యమైన సమావేశం ఉంటే అన్ని పనులు పక్కనపెట్టి హాజరవుతాం కదా మరి సంఘ ప్రార్థన కోసం అన్ని పనులు పక్కనపెట్టి అప్పుడప్పుడైనా హాజరవుతున్నామా?
2. ఆదివారం సంఘ ఆరాధనకు వెళ్తున్నాం అది చాలు.సంఘ ప్రార్థనలకు వెళ్లకపోయినా పరవాలేదు అనే తత్వం కలిగి ఉంటున్నామా ?
3. ప్రార్థన లేకుండా దేవుని కొరకు దేవుని పరిచర్య చేయగలమని స్వశక్తి మీద ఆధారపడుతున్నామా ?
పరీక్షించుకుందాం, పశ్చాత్తాపపడదాం, సంఘముగా ప్రభువు మీద ఆధారపడి ప్రార్థించడం మొదలుపెడదాం.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment