"మా తల్లిదండ్రులు ఇదే సంఘ సభ్యులు నేను ఈ సంఘంలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే సభ్యత్వం తీసుకున్నాను, ఇక ఇక్కడే బ్రదర్". ఇవి ఒక క్రైస్తవ సోదరుని మాటలు.
ఒకవేళ ప్రతి క్రైస్తవుడు ఇలానే ఆలోచిస్తే క్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళుతూ తన శిష్యులకిచ్చిన ప్రధానమైన,గొప్ప ఆజ్ఞ (మత్తయి 28:19,20) ఎలా నెరవేరుతుంది ?
బాప్తీస్మమిచ్చుచూ, బోధించుచూ,సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి అనే ఆజ్ఞ కేవలం నాయకులకు మాత్రమే కాదు క్రీస్తుని విశ్వసించిన ప్రతి వ్యక్తికి అని తెలుసుకోవాలి.
మరోవైపు ఈ ఆజ్ఞను లోతుగా పరిశీలిస్తే, క్రీస్తు శిష్యులకిచ్చిన ఈ గొప్ప ఆజ్ఞ, సంఘ స్థాపన వైపు ప్రోత్సహించే విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానిక సంఘ సందర్భంలోనే బాప్తీస్మం ఇవ్వడం క్రీస్తు బోధలను బోధించడం తద్వారా క్రీస్తు శిష్యులను తయారు చేయడం జరుగుతుంది కాబట్టి.
పారా చర్చ్ సంస్థలు శిష్యత్వపు తర్ఫీదు అని టీచింగ్ చేయగలరు కానీ, బాప్తీస్మం ఇవ్వడం, పాస్టర్ల లాగా విశ్వాసుల ఆత్మీయ జీవితాలను పర్యవేక్షించడం చేయలేరు. క్రీస్తు సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు, పారా చర్చ్ సంస్థల కొరకు కాదు. పౌలు సంఘాలకు ఉత్తరాలు రాశాడు, పారా చర్చ్ సంస్థలకు కాదు.
క్రీస్తు సంఘం కొరకు మరల వస్తున్నాడు, పారా చర్చ్ సంస్థల కొరకు కాదు.
అలాగని, పారా చర్చ్ సంస్థల పనిని తక్కువ చేయాలని కాదు. ఒక రకంగా సంఘం చేయాల్సిన పని చేయలేక పోయినందునే, పారా చర్చ్ సంస్థలు ఈ శిష్యత్వపు పనిని భుజాన వేసుకుంది.
వీటి వల్ల ఎంతో మందిని ప్రభువు రక్షించాడు. దేవునికి స్తోత్రం. కానీ, వాక్యం సంఘానికి ఈ ఆజ్ఞ ఇచ్చిందని మర్చిపోకూడదు.
అందుకే, పారా చర్చ్ సంస్థలు సంఘానికి కింద లేదా సంఘంతో చేతులు కలిపి పని చేయాలి. సంఘానికి వేరుగా ఉంటూ, సంఘ పరిచర్యకి పోటీగా పరుగెత్తే పారా చర్చ్ సంస్థలు ఆరోగ్యకరమైనవి కావు.
క్రీస్తు సువార్త సమస్త ప్రజలకు చేరాలంటే సంఘంలో ఉన్నవారు సువార్త పంచాలి, సంఘము శిష్యులను,నాయకులను తయారుచేయాలి,సంఘము కొత్త సంఘాలను స్థాపించాలి.
అపొస్తలుల కార్యముల పుస్తకంలో పెంతెకొస్తు దినాన జరిగింది అదే.
సువార్త విన్న 3,000 మంది శిష్యులతో కలిశారు,ఆ తర్వాత బోధలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో,సహవాసంలో ఎడతెగక ఉన్నారు అంటే సంఘంగా కలిసి జీవించడం ఆరంభించారు.
ఈ గుంపు అక్కడక్కడ చెదిరి సంఘాలుగా కలవడం మొదలుపెట్టారు.
పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో వివిధ ప్రదేశాల్లో సువార్త పంచి, సంఘాన్ని స్థాపించి నాయకులను నియమించి మత్తయి 28:19,20 ని నెరవేర్చాడు.
మన రాష్ట్రంలో మన దేశంలో సువార్త వెదజల్లబడాలని ప్రార్థన చేస్తున్నామా? మంచిదే కానీ, మరోవైపు సంఘానికి, నూతన సంఘాలను స్థాపించే దేవుడిచ్చిన ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తున్నామా?
ఒకసారి ప్రశ్నించుకుంటే మంచిది.
- డా.శంకర్ బాబు
Well Said...Anna gaaru
ReplyDelete