మత్తయి సువార్త 7: 3-5
నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?
నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
పై వచనాల అర్థమేంటి ?
మనం ఇతరులను క్రిటిసైజ్ చేస్తాం అనగా సులువుగా విమర్శిస్తాం.
తప్పుడు ఉద్దేశాలతో తీర్పు తీరుస్తుంటాం. మన సొంత జీవితాలను పరీక్షించుకోవడంలో మనల్ని మనం తీర్పు తీర్చుకోవడంలో ఫెయిల్ అవుతుంటాం.
నలుసు చాలా చిన్నది దూలము అంటే చెట్టు యొక్క పెద్ద కాండం.
ఇక్కడ యేసు చెబుతున్న విషయం ఏంటంటే మనలోనే చాలా బలహీనతలు తప్పులు ఉంచుకొని ఇతరుల జీవితాల్లో గల చిన్న విషయాలను బట్టి విమర్శ చేస్తుంటాం అనే సంగతి.
అందుకే, ఒకాయన
మనం ఇతరుల తప్పులను బట్టి తీర్పు తీర్చే మంచి న్యాయాధిపతులం కానీ, మన తప్పులను మనమే సమర్థించుకునే న్యాయవాదులం అన్నాడు అంటే డిఫెన్స్ లాయర్స్ మని అర్థం.
దీనినే స్వనీతి వైఖరి అనొచ్చు.
ఇతరుల ఉద్దేశాలను వారి హృదయంలో ఉన్న విషయాలను మనకు అన్నీ తెలుసన్నట్లుగా తీర్పు తీరుస్తాం.
ఉదాహరణకు ఫలానా ఆయన ఈ పని చేశాడు ఆయనకు చాలా గర్వం ఉంది అనేస్తాం.
ఆ వ్యక్తి మంచి ఉద్దేశంతోనే చేయొచ్చు కానీ, మనం ఆయన మనసును ఎరిగినవారమైనట్లు గర్వాందుడు అనే ముద్ర వేసేస్తాం.
ఆ సహోదరి, తాను తగ్గింపు గల వ్యక్తిని ఇతరులకు చూయించుకోవాలని అలా చేసింది అంటాం. ఆమెకు అటువంటి ఉద్దేశమే లేకపోవచ్చు.
ఆడవాళ్ళు నగలు వేసుకొని ఆదివారం వస్తే, వారికి బంగారం మీద పిచ్చి, వారికి నగలు ఉన్నాయని చూపించుకోవాలని కొందరు తీర్పు తీరుస్తే, మరికొందరు వారు ఆ నగలు వేసుకొని పాపం చేశారు అని తీర్పు తీరుస్తారు.
అందుకే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి 7:1 వచనంలో తీర్పు తీర్చకుడి అంటాడు.
ఇక్కడ ప్రభువు పాపం విషయంలో తీర్పు తీర్చవద్దు అని చెప్పటం లేదు.
ఎందుకంటే అదే అధ్యాయం 7:15 వచనంలో అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు అంటాడు.
అనగా ఎవరు అబద్ధ ప్రవక్తలు ఎవరు సత్య ప్రవక్తలు అనే వివేచన అవసరం.
ఆ విధంగా తీర్పు తీర్చక పోతే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధ చేసే అవకాశం ఉంటుంది.
పౌలు 1 కొరింథీయులకు 5:12,13 లో
వెలుపలివారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని
మీరు లోపటివారికి (అనగా సంఘంలో గల వారికి) తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని (అంటే పాపం చేసిన ఆ వ్యక్తిని) మీలో నుండి వెలివేయుడి అంటాడు.
యోహాను సువార్త 7:24 లో క్రీస్తు వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
అనగా సరైన విధంగా, పాపం విషయంలో తీర్పు తీర్చమని అర్థం.
ఒక వ్యక్తి పాపం చేసినట్లయితే తప్పకుండా ప్రేమతో తగ్గింపుతో ఆ వ్యక్తిని పాపం విషయంలో తోటి విశ్వాసులుగా ప్రశ్నించొచ్చు, సరి చేయొచ్చు.
కానీ ఇతరుల యొక్క ఉద్దేశాలను తెలుసుకోకుండా వారు చేసే కొన్ని పనులను బట్టి తీర్పు తీర్చడం వాక్యానుసారమైనది కాదు.
ఇతరుల్ని విమర్శించడానికి ముందు మన హృదయం, మన బలహీనతలు కూడా పరీక్షించుకోవాలి. అప్పుడే ఇతరుల బలహీనతలు తేటగా చూసి, వారికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది.
మన ప్రధాన సమస్య ఏంటంటే, మనమే సక్కగుండం కానీ, పక్కోల్ల పాపాల మీద పడి ఏడుస్తుంటాం.
దేవుడు మొదట మన కంట్లో గల దూలమును ఆయన మీద ఆధారపడి తీసేసుకోవడానికి సహాయం చేయును గాక.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment