మత్తయి 16:18
మరియు నీవు పేతురువు.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను.
చాలామంది ఈ వచనాలను బోధిస్తూ పేతురు మొట్టమొదటి బిషప్ గా నియమించబడ్డాడు, ఆయన అధికారిగా ఆయన మీద కొత్త నిబంధన సంఘం కట్టబడింది అని చెబుతుంటారు.
ఈ బోధ మొదలుపెట్టింది రోమన్ క్యాథలిక్ ప్రజలు.
పేతురుకు సంఘం మీద అధికారం ఇచ్చి ఆయనను మొట్టమొదటి పోపుగా వాళ్ళు నియమించి ఈ బోధను అప్పట్లో చేశారు. ఆ తర్వాత పోప్ సిస్టమ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
ఆదిమ అపోస్తుల బోధ ద్వారా దేవుడు సంఘాన్ని కట్టడం వాక్యం చెబుతున్నప్పటికీ (ఎఫేసీ 2:20),
పేతురు లేదా ఇతర అపోస్తలులు మూల రాయిగా లేదా పునాదిగా దేవుడు తన సంఘం కట్టాడని, కడుతున్నారని చెప్పడం సరియైనది కాదు.
ఈ వాక్య భాగాన్ని సరైన విధంగా అర్ధ వివరణ చేయకపోవడం వలన ఇటువంటి వాక్య విరుద్ధమైన విషయాలను సంఘానికి బోధించడం జరుగుతుంది.
ఈరోజు ఆ వాక్యాన్ని వివరించాలని నేను ఇష్టపడుతున్నాను.
1. నువ్వు పేతురువు
ఇక్కడ పేతురు అన్న పదానికి అర్థం (లాటిన్ లో పెట్రస్ లేదా పెట్రోస్ ) రాయి అని.
ఈ పదం లాటిన్ భాషలో masculine proper noun. పురుష నామవాచకం.
అంటే, పురుషులకు వర్తించే పదం.
రాయి అని అర్థం వచ్చింది కాబట్టి ఆ తర్వాత "ఈ బండ మీద" అనే పదాన్ని కలిపి అదే రాయి మీద క్రీస్తు తన సంఘాన్ని కడతానని అన్నాడు అంటుంటారు.
ఇక్కడ రాయి అంటే చిన్న రాయి అని అర్థం.మనం పెబ్బెల్స్ అంటాం.తెలుగు బైబిల్లో ఫుట్ నోట్స్ చూడండి .
2. ఈ బండ మీద
ఇక్కడ బండ అనే పదం పెట్రా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇది feminine of the masculine noun Petros.పురుష నామవాచకమైన పెట్రోస్ అనే పదానికి స్త్రీ అర్థం.
అంటే స్త్రీ సంబంధమైన అర్థమిచ్చే పదం.
దీనికి అర్థం ఏమిటంటే : బండ అంటే పెద్ద రాయి.
పెద్ద బండ నుండి చిన్న రాళ్లు వస్తాయి.
ఇదే పదాన్ని ఇంకా ఎక్కడ వాడారో చూద్దాం.
మత్తయి 7:24,25
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అంటాడు.
ఇక్కడ బండ అంటే గట్టి పునాది రాయి అని అర్థం.
మత్తయి 27:50,51
యేసుక్రీస్తు చనిపోయినప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగింది. భూమి వనికింది, బండలు బద్దలాయెను అని రాయబడింది.
బండ అంటే పెద్దది.
అవే బద్దలవుతాయి,చిన్నవి బద్దలవ్వవు.
మత్తయి27:60 :
యోసేపు తన సమాధిలో యేసు శవాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను.
అంటే మనకు అర్థమైన విషయం ఏమిటంటే, ఇక్కడ యేసు పేతురు మీద సంఘం కట్టడం గురించి మాట్లాడట్లేదు అని.
3. మరి ఈ బండ ఎవరు ?
నూతన నిబంధనలో ఎవరు బండగా సంబోధించబడ్డారో ఇప్పుడు చూద్దాం.
1కొరింథీ 10:4 : అందరూ ఆత్మసంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయినగా తమని వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే.
1 పేతురు 2:8 - ఇల్లు కట్టు వారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను మరియు అది అడ్డురాయియి అడ్డు బండయు ఆయెను.
ఎవరు నిషేదించ బడిన రాయి ?
క్రీస్తు.
ఆయనే తల రాయిగా పిలవబడ్డాడు.
ఇక్కడ పేతురే క్రీస్తుని కార్నర్ స్టోన్ అంటున్నాడు.
ఇప్పుడు ఎఫేసీ 2:20 : క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.
ఇప్పుడు చెప్పండి ఎవరు ఈ బండ ?
క్రీస్తే..
పేతురు కాదు, మరే అపోస్తలుడు కాదు.
క్రీస్తే పునాది, క్రీస్తే మూలరాయి.
4. నా సంఘమును
నా : అంటే ఎవరు ? క్రీస్తు.
క్రీస్తు ఎవరు ? మన ఫ్రెండ్ లేదా బడ్డీ కాదు, స్కూల్ టీచరో, రాజకీయ నాయకుడో కాదు.
క్రీస్తు దేవుడు. త్రిత్వములో రెండవ వ్యక్తి. సృష్టికర్త. నరావతారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు.
ఆయన అంటున్నాడు : నా సంఘము.
సంఘము ఎవరిది ?
పాస్టర్ గారిది కాదు, సంఘస్తులది కాదు, సంస్ధది కాదు, గవర్నమెంట్ ది కాదు. సంఘము క్రీస్తుది.
మనం ఉన్న సంఘం క్రీస్తుది, ఈ రాష్ట్రంలో గల సంఘాలు, ఈ దేశంలో గల సంఘాలు ప్రపంచంలో గల సంఘాలు క్రీస్తువి.
ఇతర సంఘాలను చిన్న చూపుతో చూడడం ఆపాలి. మీ సంఘమే ఆత్మీయమైన సంఘం, మిగతా సంఘాలన్నీ ఆత్మీయమైనవి కావు అనే తత్వాన్ని చంపాలి.
ఎందుకంటే ఆ సంఘాలు కూడా ఆయనవే.
అబద్ధ సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు, ప్రాస్పరిటి బోధిస్తూ క్రీస్తును పక్కన పెట్టే సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు కానీ, మనలాగా కాక కాస్త వేరుగా పరిచర్య చేస్తూ, క్రీస్తును హెచ్చించే సంఘాలను చిన్నచూపు చూడటం కరెక్ట్ కాదు.
5. ఎవరు కడుతున్నారు ?
యేసు అంటున్నాడు, నేను కట్టెదను.
సంఘాన్ని ఏ పాస్టర్ కట్టలేడు, సంఘాన్ని ఏ విశ్వాసులు కట్టలేరు, సంఘాన్ని ఏ సంస్థ కట్టలేదు.
కేవలం క్రీస్తు మాత్రమే తన సంఘాన్ని కట్టగలడు,కడతాడు,కడుతున్నాడు.
ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం.
మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మన సంఘం చిన్నది అని బాధ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ సంఘం పెద్దది అని పోల్చి చూడడం అవసరం లేదు.
ఆయన కడతానని అన్నాడు. కడతాడు.
120 మందితో కట్టడం మొదలు చేశాడు. పెంతెకోస్తు పండుగ నుండి సంఘాన్ని కట్టడం దేవుడు ఆరంభించాడు.
సంఘానికి కావాల్సిన మనుషులను లేపాడు, సంఘాన్ని అబద్ద బోధల నుండి రక్షించాడు, సంస్కరణ ఉద్యమం లేవనెత్తాడు, స్థానిక భాషల్లో బైబిళ్లు ముద్రించాడు, రిలీజియస్ మూవ్మెంట్స్ స్టార్ట్ చేశాడు, కడుతూనే ఉన్నాడు.
ఇకముందు కూడా కడతాడు.
ముందు ముందు కూడా "ఎవరైతే తండ్రి చేత ఆయనకు ఇవ్వబడ్డారో వాల్లోస్తారు,"
సంఘం కట్టబడుతూనే ఉంటుంది.
ఆయనే దానికి పునాది, ఆయనే దానికి శిరస్సు ఎందుకంటే ఆయనే సంఘం కొరకు ప్రాణం పెట్టాడు.
నువ్వు పెట్టలే, పాస్టర్ పెట్టలే, ఏ బైబిల్ స్కాలర్, టీచర్ పెట్టలే, క్రీస్తు ప్రాణం పెట్టాడు (అపోస్త 20:28).
6. ఏంటి ఈ సంఘం ?
పాతాళలోక ద్వారాలు ఈ సంఘం ఎదుట నిలువనేరవు.
అంటే అర్థం ?
స్టీవెన్ కోల్ గారు : పాతాళం యొక్క శక్తులన్నీ కలిసి కూడా ఆయన సంఘమును ఏమీ చేయలేవు.
ఎన్నో వైఫల్యాలు, ఎన్నో శ్రమలు ఇంటా బయట, ఎన్నో దాడులు జరిగినా సంఘం ఒకరోజు క్రీస్తుతో విజయం పొందుకోబోతుంది.
ఎలా సాధ్యం ?
మా ఊర్లో మమ్మలని తిడుతున్నారు, కొడుతున్నారు, మా చర్చ్ బిల్డింగ్ కూల్చేశారు, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
సంఘం ఎలా విజయోత్సవం జరుపుకుంటుంది అని సందేహ పడుతున్నావేమో !
ఇలా వెళ్ళడమే విజయం, ఇలా వెళ్తుంది అని ముందే చెప్పలేదా ?
నన్ను వెంబడిస్తే మీకు సన్మానాలు చేస్తారు, మీకు గుడి కడతారు, మీ మీద ఈగ వాలకుండా చూస్తారని చెప్పాడా ప్రభువు ? లేదే !
మిమ్మల్ని కొడతారు, ఈడుస్తారు, చంపుతారు అంతము వరకు సహించుడి.
ఇదిగో నేను మీకు తోడై ఉంటాను అన్నాడు.
7. ఎలా కడుతున్నాడు, ఎలా కడతాడు క్రీస్తు ఈ సంఘం ?
మత్తయి 38:19,20 : Great commission
గొప్ప ఆజ్ఞ.
తన శిష్యులకు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ.
క్రీస్తు తన సంఘాన్ని తన సంఘంతో కడుతున్నాడు, కడతాడు.
సంఘం సువార్త పని చేసినప్పుడు తన ప్రజలను రక్షిస్తూ సంఘాన్ని కడతాడు.
సువార్త పని చేస్తున్నామా ?
అపొస్తలుల కార్యములు పుస్తకంలో దేవుని కార్యములు మనం చూస్తాం.
ఏ విధంగా దేవుడు తన సంఘాన్ని కట్టాడో మనం చదువుతాం.
ఏం చేశారు ఆయన శిష్యులు ?
సువార్త చెప్పారు అంతే.
మనం సువార్త చెప్పడానికి పిలవబడ్డాం. We have one message to share. The message of God.
సంఘం ఎలా కట్టబడుతుంది, సంఘం ఎలా విస్తరిస్తుంది ?
సంఘం సువార్త సందేశం నమ్మకంగా చెప్పినప్పుడు, దేవుడు సంఘాన్ని కడతాడు. ఆయనే తన ప్రజలను సంఘానికి జోడిస్తారు, ఆయనే సంఘాన్ని పెంపొందిస్తాడు.
మా సంఘానికి ఎక్కువ మంది రావట్లేదు అనుకోవద్దు. అభివృద్ధి అనేది కేవలం నంబర్స్ మీద ఆధారపడేది కాదు, నిజమైన సభ్యుల ఎదుగుదల మీద ఆధార పడేది.
Keep sharing the Gospel, God will build his church.
రక్షించబడ్డ వారిని శిష్యులుగా సంఘంలో చేర్చి సంఘాన్ని కడతాడు.
ఈ సంఘం దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవునిలో కలిసి ఎదుగుతూ, సరిచేసుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుని కొరకు కట్టబడుతుంది.
ఈ సంఘం, లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉంటుందా ?
ప్రేమలో ఎదుగుతూ ఒకరిపట్ల ఒకరు ప్రేమ సంబంధాలు పెంచుకుంటూ కొనసాగుతుందా ?
ఒకరి పాపములు ఒకరు సరి చేసుకుంటూ, తగ్గింపు కలిగి ఎదుగుతుందా?
అయితే ఈ సంఘం, క్రీస్తు కడుతున్న సంఘం.
ఈ సంఘం ప్రోస్పెరిటీ బోధ చేస్తుందా, కేవలం ప్రోగ్రామ్లు నడిపిస్తూ, విశ్వాసులను నిర్లక్ష్యం చేస్తుందా,
వాక్యాన్ని వక్రీకరించి అబద్ద బోధ చేస్తుందా, అయితే అది క్రీస్తు కట్టని సంఘం - అంటే క్రీస్తు విరోధి కడుతున్న సంఘం.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment