మత్తయి 28:19,20
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి;
తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు
నామములోనికి
వారికి బాప్తిస్మమిచ్చుచు
నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని
గైకొనవలెనని వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
శిష్యులను ఎందుకు తయారు చేయాలి?
ఎందుకంటే అది ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ.
ఎవరు శిష్యులను చేయాలి?
ఈ మాటలు,యేసు తాను పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళేముందు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు ఆయన శిష్యులుగా ఉన్నవారికి, నేడు ఆయన శిష్యులుగా ఉన్నవారికి కూడా ఆ మాటలు వర్తిస్తాయి కాబట్టి, పాస్టర్లు, నాయకులు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు శిష్యులను చేయమని క్రీస్తు ఆజ్ఞాపించాడు అని ఈ వాక్యం బోధిస్తుంది.
ఎందుకంటే పై వాక్యం ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది కాబట్టి.
శిష్యులను చేయడం అనేది మన తోటి సోదరులు మరియు సోదరీమణులను క్రీస్తుతో సంబంధంలోకి ప్రవేశించడం ద్వారా క్రీస్తు పోలికలో ఎదగడానికి సహాయం చేయడం తప్ప మరొకటి కాదు. అదే వాక్యానుసారమైన శిష్యత్వం.
19,20 వచనాలను నిశితంగా గమనిస్తే, శిష్యులను చేయడం ఇక్కడ ప్రధాన క్రియ.
సువార్త కోసం వెళ్ళడం, బాప్తీస్మం ఇవ్వడం, మరియు బోధించడం అనేవి శిష్యులను తయారుచేసే ప్రక్రియలో చేయాల్సిన పనులు.
మనము వెళ్లి సువార్త ప్రకటించడం ద్వారా శిష్యులను చేసే పని మొదలుపెడతాము.
సువార్త ప్రకటించడం ప్రతి ఒక్కరి పని అని మనకు తెలుసు.కాబట్టి అందరూ శిష్యులను చేయాలి అని ఒప్పుకోవాల్సిందే.
బాప్తీస్మం అనేది సంఘానికి ఇవ్వబడిన సంఘ క్రమాలలో ఒకటి. ఇది స్థానిక సంఘంలోనే ఆచరించబడుతుంది.
విశ్వాసులకు బాప్తీస్మం ఇవ్వడం ద్వారా మనము శిష్యులను చేసే ప్రక్రియ కొనసాగిస్తాం.
బాప్తీస్మం తీసుకోవడం ద్వారా
రక్షించబడి బాహ్యంగా సాక్ష్యం ఇవ్వడమే కాకుండా, ఒక వ్యక్తి క్రీస్తు శరీరమైన సంఘానికి అంటుకట్టుబడతాడని తెలుసుకోవాలి.
అందుకే, బైబిల్ సంబంధ సంస్థలు బాప్తీస్మం ఇవ్వవు, రక్షించబడిన వారిని స్థానిక సంఘానికి వెళ్లి అక్కడే బాప్తీస్మం తీసుకోమని చెబుతారు.
సంఘంలోని విశ్వాసులకు క్రమపద్ధతిలో దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా మనము శిష్యులను తర్ఫీదు చేస్తాము.
కొన్ని సంస్థలు కూడా శిష్యతపు తర్ఫీదు ఇస్తాయి కానీ, ఇతర విశ్వాసులతో కలిసి దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ఆ వాక్యాన్ని విశ్వాసులు గైకొని పాటిస్తున్నారో లేదో చూసి వారిని క్రీస్తు సారూప్యంలోకి మార్చే ప్రక్రియ కేవలం స్థానిక సంఘంలోనే సాధ్యమవుతుంది.
క్రైస్తవ సంస్థలు బోధ చేయగలవు కానీ, క్రైస్తవులను జవాబుదారీతనంలో మరియు క్రమశిక్షణలో పెంచలేవు.
అది సంఘం యొక్క ప్రేమ వాతావరణంలోనే జరిగి, విశ్వాసుల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
కొత్త నిబంధనలో ఇదే నమూనా మనం చూస్తాం.
అపొస్త 2: 41, కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
పెంతెకోస్తు పండగ రోజున 120 విశ్వాసులకు 3000 వేల మంది జోడించబడ్డారు.
ఆ వెంటనే వారు చేసిందేమిటి?
2:42 వచనంలో వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
అంటే సంఘంగా కూడుకోవడం మొదలుపెట్టారు.
యేసు ప్రభువు చెప్పిన సువార్త ద్వారా శిష్యులు మారు మనస్సు పొందుకున్నారు, బాప్తీస్మం తీసుకున్నారు అదేవిధంగా వాక్యమును నేర్చుకోవడానికి తమను తాము అప్పచెప్పుకున్నారు.
మత్తయి 28:18,20 లోని యేసు మాటలను ఆయన శిష్యులు ఇలా ఆచరించారు.
అంటే, స్థానిక సంఘము ద్వారా మాత్రమే శిష్యులను తయారుచేయడం వాక్యానుసారమైన ప్రక్రియ అని అర్థమవుతుంది.
యేసు ప్రభువు ఆనాడు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞకు ఈనాడు మనం కూడా విధేయత కలిగి క్రీస్తు శిష్యులను చేయుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment