పాపని స్కూల్ లో జాయిన్ చేద్దామని తనని తీసుకొని బైకులో బయల్దేరాడు శంకర్.
అడ్మిషన్ ఫార్మ్ లో ఏమేమి రాయాలో తలుచుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు రాగానే ఆ రోడ్డుని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమాత్రం గుంతలు లేకుండా చక్కగా ఉంది.
చాలా క్రమశిక్షణగా కార్లు, బైకులు వెళ్తున్నాయి, అసలు హార్న్ సౌండ్స్ వినపడటమే లేదు.
ఇది మా పట్టణమేనా? రాత్రికి రాత్రి ఏమైంది ఈ నగరానికి అంటూ బైక్ ముందుకు పోనిచ్చాడు.
రోడ్డు మీద అసలు చెత్త కనిపించడం లేదు. ట్రాఫిక్ లైట్ దగ్గర బండి ఆపగానే పరుగెత్తుకొని వచ్చే పిల్లలు కూడా అక్కడ లేరు. కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరైనా వచ్చి ఇలా మార్చేసారేమో అనుకున్నాడు శంకర్.
అంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా, సైడ్ నుండి వచ్చి బైక్ ని గుద్దేసాడు ఓ యంగ్ మ్యాన్.
శంకర్ మరియు పాప ఇద్దరూ కింద పడ్డారు. పాపకి తనకి ఏం అవ్వలేదని ఊపిరి పీల్చుకున్నాడు. బట్టలమీద పడ్డ దుమ్ము దులిపేసుకుంటుంటే,
సారీ అంకుల్, నాదే తప్పు, సారీ అంటూ దండం పెడుతున్న యవ్వనస్తుణ్ణి చూస్తూ విస్తుపోయాడు. తప్పు మనదైనా, ఇటువంటి పరిస్థితిలో పక్కవాడినే టార్గెట్ చేసి పైసలు వసూలు చేయడం కామన్ కదా! కానీ ఇక్కడ రివర్స్ గా జరుగుతుంది. పర్లేదు బాబు, దెబ్బలు తగిలాయా, హాస్పిటల్ కి పోదాం రా, ట్రీట్మెంట్ చేసి పంపిస్తా అన్నాడు శంకర్.
లేదు అంకుల్, చిన్న దెబ్బలే ఇవి, సారీ అని బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ యంగ్ హీరో. యంగ్ జనరేషన్ ఇలా తగ్గి మాట్లాడ్డం అరుదు అని బయల్దేరాడు శంకర్.
పెట్రోల్ కొట్టిద్దామని బంకుకి వెళ్తే పెట్రోల్, డీజిల్ మీద ప్రభుత్వం 50 రూపాయలు తగ్గించింది అని తెలుసుకొని తెగ ఆనందపడ్డాడు.
రోడ్డు పక్కన ఏదో కార్యక్రమం జరుగుతుండడం గమనించి, " ఎంటి ఈ హడావుడి" అని అడిగాడు. ముఖ్యమంత్రి గారు ఈ మురికివాడ అంతా కలయతిరుగుతున్నారు అని జవాబిచ్చాడు కిళ్లీ కొట్టు కృష్ణ. ప్లెక్సీలు లేవు, పోలీస్ బలగాలు లేవు,
పెద్ద కాన్వాయ్ లేదు, ప్రజల గుంపు లేదు. ఒక పది మంది కాలి నడకన వెళ్తున్నారు, వారిలో ఒకరు ముఖ్యమంత్రి గారు. మన రాజకీయ నాయకులు ఇలా చేయరే, అంతా వింతగా ఉంది అనుకుంటూ సాగిపోయాడు.
స్కూల్ కి వెళ్ళగానే, ప్రిన్సిపల్ గారిని కలిసి, నేరుగా అడ్మిషన్స్ చేసే ఆఫీస్ కి వెళ్ళాడు.
అడ్మిషన్ ఫార్మ్ నింపుతుంటే మతం,కులం అనేవి కనిపించలేదు. ఇవి ఎప్పుడు తీసేశారు అని సంతోషిస్తూ డబ్బు కట్టి తిరిగి ఇంటికి బయల్దేరారు.
కాస్త పెద్ద ఇల్లు అద్దెకి చూడమని భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చి, To-let బోర్డు తగిలించిన ఓ ఇంటికి వెళ్లి అడిగాడు. వారితో మాట్లాడితే వాళ్ళు బ్రాహ్మణులని అర్థమయ్యింది.
దాచితే బాగుండదని మేము క్రైస్తవులం అని చెప్పాడు శంకర్. పర్వాలేదు సార్, అందరం మనుష్యులమే కదా ! ఫస్ట్ ఫ్లోర్లో ఒక ముస్లిం ఫ్యామిలీ కూడా ఉన్నారు అని అన్నాడు ఆ ఇంటి ఓనర్. నోరెళ్ళబెట్టి అలా చూస్తూ నిలబడిపోయాడు శంకర్.
ఏమైంది సార్ అని ఓనరు గారు పిలుస్తున్నారు.
ఏమండీ లేవండి, టైం తొమ్మిదైంది, ఇంకా నిద్రలో ఉన్నారేంటి అని పిలుస్తున్న భార్య గొంతు వినగానే, టక్కున లేచి కూర్చున్నాడు శంకర్.
కళ్ళు తుడుచుకుంటూ తనలో తాను నవ్వుకుంటున్న భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది శంకర్ భార్య మేరీ.
- డా.శంకర్ బాబు
ఇదంతా నిజమే అయితే, అప్పుడు మన దేశం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఆశగా ఉంది అన్న. చాలా చక్కగా రాసినందుకు వందనాలు అన్న.
ReplyDelete