నేను ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను.
ఇంకా అంటరానితనం ఇప్పటికీ మా కుటుంబాల్లో కొనసాగుతూనే ఉంది.
నేను పెరిగేకొద్దీ నా తల్లిదండ్రులు వారి మధ్య గల సమస్యలు చూస్తూ చాలా బాధపడేదాన్ని.
ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నందున నేను తరచుగా ఆత్మహత్య ఆలోచనలను కలిగి ఉండేదాన్ని.
నేను చస్తే నా తండ్రిలో మార్పు వస్తుందని, కనీసం అప్పుడైనా మా నాన్న, నా చెల్లెలు మరియు తల్లిని చక్కగా చూసుకుంటాడేమో అని, నా జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను.
నేను నా ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నప్పుడు, నా సీనియర్‌ను కలవడం జరిగింది.
ఆమె తన స్నేహితుడి నుండి సువార్త విన్న విషయం నాకు వివరించింది.
ఆత్మహత్య అనేది సరైంది కాదనీ,మన సమస్యలన్నింటికీ యేసు క్రీస్తు వద్ద పరిష్కారం దొరుకుతుందని నాకు చెప్పింది.
మన జీవితాన్ని ఆయనకు ఇస్తే ఆయన మన జీవితాలను మారుస్తాడు అని చెప్పిన మాటలు నన్ను నిజంగా ఆలోచింపచేశాయి.
అదే రాత్రి నేను యేసుక్రీస్తుకు ప్రార్థన చేశాను.
ఈ దేవుడు నా ప్రార్థన విన్నాడని,నా హృదయంలో ఆనందాన్ని అనుభవించాను.
ఆ సమయంలో ఏడుస్తూ నేను యేసుక్రీస్తును మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను.
అదే వారంలో నా స్నేహితురాలు నన్ను చర్చికి తీసుకువెళ్ళింది. అక్కడ ప్రసంగీకుడు సువార్త ప్రకటించినప్పుడు ఆ రోజు నా జీవితాన్ని క్రీస్తుకు సంపూర్తిగా అప్పగించాను.
నా పాపాల కొరకు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువు అధికారానికి లొంగిపోయాను.
స్వార్థ స్వభావం, అహంకారం, నిజాయితీ లేనితనం,కపటత్వం, నమ్మకద్రోహం వంటి నా పాపాలు ఒప్పుకున్నాను.
యేసు సిలువపై చేసిన త్యాగం నా పాపాలన్నిటినీ పరిష్కరించడానికి సరిపోతుంది అని నాకు ఆ రోజు అర్థమయ్యింది.
ఇక నా క్రైస్తవ ప్రయాణం కష్టంగానే మొదలయ్యింది. ఇంట్లో చాలా రహస్యంగా ప్రార్థన చేసుకునేదాన్ని.
ఒక రోజు నా తండ్రి నేను బైబిల్ చదువుతుంటే చూసి, కోపంతో బైబిల్ లాక్కొని చించి విసిరి కొట్టాడు.
మళ్ళీ బైబిల్ చదవవద్దని నన్ను గట్టిగా హెచ్చరించాడు.
అదే సమయంలో నా కాలేజీలోని ఒక లెక్చరర్ నాకు పరిచయం అయ్యారు.
ఆమె దైవభక్తిగల ఒక క్రైస్తవ మహిళ. నాతో పాటుగా, అవిశ్వాస కుటుంబాల నుండి వచ్చిన ఇతర అమ్మాయిలకు ప్రోత్సాహం, ధైర్యం ఇచ్చింది.
ప్రార్థన ఎలా చేయాలో,వాక్యం ఎలా చదవాలో ఆమె మాకు నేర్పింది.
నేను హృదయపూర్వకంగా దేవున్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను.
నేను నా బస్సు ప్రయాణాల్లో, బాత్రూంలో బైబిల్ చదవడం మరియు ప్రార్థించడం మొదలుపెట్టాను.
మైక్రో జిరాక్స్ చేసి నా పుస్తకాలలో బైబిల్ వాక్యాలు అతికించేదాన్ని.
అధ్యాయం వారీగా పేజీలు చింపి, నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్లి చదివేదాన్ని.
దాదాపు ఆరు సంవత్సరాల తరువాత నేను నా క్రైస్తవ విశ్వాసం గురించి నా తల్లిదండ్రులకు బహిరంగంగా చెప్పాను. అప్పటి నుండి వాళ్ళు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి, నా వెనక గూఢ చారులను పంపించడానికి ప్రయత్నించారు.
నేను నా ప్రభువుకు నమ్మకంగా ఉంటానని, నేను యేసును మాత్రమే అనుసరిస్తానని వారికి చెప్పాను.
నా వివాహం గురించి నిర్ణయించుకోవలసి వచ్చినప్పుడు, వారు నేను బ్రాహ్మణురాలిగా జీవించాలని, బ్రాహ్మణున్ని వివాహం చేసుకోవాలని, బ్రాహ్మణురాలిగా చనిపోవాలని చెప్పారు.వారు క్రైస్తవ ప్రతిపాదనలను అంగీకరించలేదు.
ఇది నాకు తెలిసిన సిస్టర్ సాక్ష్యం.
ప్రభువు కోసం శ్రమలు అనుభవించి, సువార్త కొరకు కన్న వారిని విడిచి, పరిచర్యలో ఉన్న ఒక క్రైస్తవ సోదరున్ని వివాహం చేసుకొని, ప్రస్తుతం పరిచర్యలో నిమగ్నమైయున్నారు.
పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత సువార్త లేని ప్రదేశానికి మిషనరీలుగా పనిచేశారు.
ఇప్పుడు ఒక స్థానిక సంఘంలో సభ్యులుగా ఉంటూ, ఎంతో మందికి దీవెనకరంగా జీవిస్తున్నారు.
సంవత్సరాలుగా సంఘానికి వెళ్తూ కూడా రక్షించబడిన అనుభవం లేని నామకార్థ ప్రజలు ఈ సాక్ష్యం చదివిన తర్వాతనైనా నిజమైన మారుమనన్సు పొందాలని కోరుకుంటున్నాను.
సండే స్కూల్ నుండి పట్టుకున్న బైబిల్, కేవలం సండే చర్చికి వెళ్లేపుడు చదివేవాళ్ళకి, బాత్రూంలో,బస్సుల్లో బైబిల్ చదివిన ఈ సిస్టర్ జీవితం ప్రోత్సాహకరంగా ఉండాలని ఇష్టడుతున్నాను.
నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, మా ఫ్యామిలీ అంతా క్రైస్తవులే అని జబ్బలు చరుచుకుంటూ, క్రీస్తు కొరకు నిలబడని, క్రీస్తు ఆజ్ఞలు పాటించని, క్రీస్తు పనిలో నిమగ్నమవ్వని వ్యక్తులను ఈ సాక్ష్యం ఉత్తేజపరచాలని ప్రార్థిస్తున్నాను.
ఏదో వ్యాధి వల్ల, ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల శ్రమలపాలైనప్పుడు
ఆ శ్రమలలో, దేవా నాకెందుకు అని దేవునిపై గొణిగే క్రైస్తవులు, నిజమైన శ్రమలు సువార్త కొరకు అనుభవించేవని, ఆ శ్రమలలో దేవుడు సహాయం చేస్తాడని నమ్మి, అధిక విశ్వాసంలో ఎదగాలని
ఆశిస్తున్నాను.
@ డా.శంకర్ బాబు

Comments
Post a Comment