నువ్వు అలా ఎందుకు మాట్లాడావో నాకు తెలుసు, ఆయన ఎందుకు అలా ప్రవర్తించాడో
నాకు తెలుసు, నీ మనసులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇలాంటి మాటలు మనం ఎప్పుడు వినేవే.
మనం కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాం.
కాని వీటిలో ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య ? అదే మనం ఇప్పుడు చదవబోతున్నాం.
మనతో ఎప్పుడూ చురుగ్గా మాట్లాడే వ్యక్తి సడెన్గా మాట్లాడ్డం మానేస్తే, ఆ వ్యక్తి మనతో మాట్లాడకపోడానికి కారణం ఇదే కావచ్చు అని కొన్నివిషయాలు ఊహించుకుంటాం.
సంఘానికి రెగ్యులర్గా వచ్చే వ్యక్తి 1-2 వారాలు రాకపోతే, ఆయన ఏదైనా పాపం చేసాడేమో, అందుకే రావట్లేదు కాబోలు అని తీర్పు చెప్పెస్తాం.
ఒక బ్రదర్ లేదా సిస్టర్ గురించి మరేవరో ఏదైనా విషయం చెబితే, ఆ బ్రదర్ సిస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా, ఆ వ్యక్తి ఇలాంటి వాడా, ఆ సిస్టర్ ఇలా అనుకోలేదు అని అపోహలు పెంచుకుంటాం.
ఇవి చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే, ఇవి వాక్య విరుద్ధమైన అభిప్రాయాలు లేదా అపోహలు కాబట్టి.
ముందుగా చెప్పినట్లు, నాకు నీ మనసులో ఏముందో తెలుసు అని చెప్పడం, నీ హృదయంలో గల ఆలోచనలు నాకు తెలుసు అనడంతో సమానం. కానీ, ఒకని హృదయాంతరంగంలో ఉన్నది తెలిసినవాడు కేవలం దేవుడే కదా !
ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, అతని మనసులో ఏముందో నీకు తెలిస్తే నువ్వే దేవుడవైపోతావు.
మనకున్న జ్ఞానం వల్ల ఇతరులను పూర్తిగా అర్థం చేసుకోగలం అనే ప్రపంచ తత్వాన్ని దేవుని వాక్యం ఆమోదించదు. యేసుప్రభువును కూడా తప్పుగా అర్థం చేసుకుని సిలువేయడం మనకు తెలిసిందే.
సరైన సాక్ష్యం లేకుండా అపోహలను ప్రోత్సహించే ఆలోచన విధానం ప్రమాదకరమైనది.
మనం ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటామో, అదే విధంగా ఇతరులు ఖచ్చితంగా ఆలోచిస్తారనే మూల సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకోవడం వల్ల ఇలాంటి అపోహలు కలిగివుంటాము. కానీ ఇది సరైంది కాదు.
కారణాలు
ఎందుకు ఇతరుల గూర్చి నెగటివ్ గా ఊహించుకుంటాం ? ఎందుకు అపోహలకు చాలా తేలిగ్గా
అవకాశం ఇస్తాం ? రెండు మూడు కారణాలు ఇక్కడ ప్రస్తావిస్తాను.
మొదటిగా, పాపం చేత మలినమైన మన హృదయమే ప్రధాన కారణం.
మొదటిగా, పాపం చేత మలినమైన మన హృదయమే ప్రధాన కారణం.
ఇతరులను నిందించడం, ఇతరుల తప్పులను పెద్దగా చూడడం, మనం పర్వాలేదు అనే తత్వాన్ని
పాప స్వభావంగా కలిగి ఉన్నోళ్ళం కాబట్టి, త్వరగా ఇతరులను తప్పుగా అర్థం చేసుకుంటుంటాం.
రెండవదిగా, ఇతరుల పద్ధతిని, ప్రవర్తనను బట్టి వారి ఉద్దేశాలను నిర్వచించేస్తాం.
ఉదాహరణకు, ఒక వ్యక్తి మనతో మాట్లాడ్డం మానేస్తే, ఆయనకు గర్వం, నాతో ఆయనకు స్నేహం ఇష్టం లేదేమో అని అనుకుంటాం. కానీ, కారణాలు వేరే ఉండొచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, కొన్ని సార్లు,కొన్ని రోజులు ఎవరితో మాట్లాడొద్దు అని నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.
వీటి గురించి తెలుసుకోకుండా మనమే ఊహించుకుని వారి ఉద్దేశాలను నిర్వచించడం మంచిది కాదు.
మూడవదిగా, నాకు అంతా తెలుసు, నేను ఇట్టే మనుషుల ముఖాలు చూసి వారేమనుకుంటున్నారో చెప్పేయగలను అనే అబద్ధ బోధను ఒంటబట్టిచ్చుకోవడం కూడా ఒక కారణం.
అసలు, మనం అనుకున్నది తప్పకుండా నిజం అవ్వాలనే రూల్ లేదనే విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి.
ఫలితాలు
1. వ్యక్తులను ఎప్పుడూ తప్పుగానే చూడడం అలవాటైపోతుంది.
2. వ్యక్తులను ప్రేమించడం తగ్గిపోతుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనే ఆజ్ఞను సంపూర్తిగా పాటించలేం.
3. గాసిప్ వినే వాళ్ళ లిస్ట్ లో చేరి, నువ్వు కూడా గాసిప్ చెప్పే గ్యాంగ్లో సభ్యుడవైపోతావు.
4. ఇతరులు నీపై నమ్మకం కోల్పోతారు, తద్వారా ఇతరులతో సంబంధాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
5. సంఘంలో నీ వల్ల ఐక్యత కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
నివారణా మార్గాలు
1.మనం ఇతరుల పట్ల పెంచుకున్న అపోహలు, ఊహాల గురించి స్పష్టంగా ఆలోచించడంలో సహాయం కొరకు
ప్రభువును అడగాలి.
2.నా అపోహలకు తగిన సాక్ష్యం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకోకుండా తీర్పు తీర్చేశానా? అనే ప్రశ్నలు వేసుకోవాలి.
మరింత సమాచారం కోసం వ్యక్తిని అడగాలి మరియు వారి దృక్పథాన్ని పరిగణలోకి తీసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నిదానంగా స్పష్టమైన ప్రశ్నలను అడగాలి.
ఉదాహరణకు ఇలా అడగొచ్చు.
"నేను ఈ విషయం ఇలా అనుకున్నాను, నేను సరిగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయండి.
ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకుంటే సరి చేయండి."
"ఇలా మీ గురించి విన్నాను, ఇది నిజమా, మీరు దీన్ని ఎలా చూస్తారనే దాని గురించి నాకు మరింత చెప్పండి."
3.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అడిగినప్పుడు, ఇతరులు ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చినప్పుడు వారిని నమ్మాలి. వారు చెప్పింది అబద్ధమని,నిజం చెప్పలేదని మళ్లీ తీర్పు తీర్చొద్ద్దు.
వాళ్ళు అబద్ధం చెప్పుంటే,వాళ్ళు ఒకరోజు దేవునికి లెక్క అప్పచెబుతారు. ఒకవేళ మనం మళ్లీ తీర్పు తీరిస్తే,
వాళ్ల హృదయాల్లో ఏముందో నాకు తెలుసు అనే తత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లే అని మర్చిపోకూడదు.
4.ఇతరులను ప్రేమించే హృదయం కోసం ప్రార్థన చేయాలి, ఆ విధంగా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి.
5.చివరిగా, సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి.
దేవుడు అపోహల నుండి మనలను విడిపించి వాక్యానుసారమైన జీవితం కలిగియుండడానికి
సహాయం చేయును గాక.

Comments
Post a Comment