![]() |
నేటి సంఘాలలో ఒకే వ్యక్తి నాయకునిగా
ఉంటూ సంఘ పరిచర్య చేయడం మనం
చూడగలం.
కానీ,నూతన నిబంధనలో గల లేఖనాలు
స్థానిక సంఘాలకు చెందిన బహుళనాయకత్వం
గురించి ఎక్కువగా వివరిస్తుంది.
ఒకరి కన్నా ఎక్కువ నాయకులు కలిసి సంఘ పరిచర్య
చేయడాన్ని బహుళనాయకత్వంగా నిర్వచించగలం.
బహుళ నాయకత్వం గురించిన లేఖన భాగాలు
మొదట ప్రస్తావించి, ఆ పిదప దాని ద్వారా
పరిచర్యలో కలిగే ఉపయోగాలు మీకు వివరించే
ప్రయత్నం చేస్తాను.
లేఖన భాగాలు
1. ఆదిమ సంఘములో అపోస్తలులు కలిసి
పరిచర్య చేశారు.
అపోస్త 2:14-36 లో పేతురు మొదటి ప్రసంగం
చేయడం మనకు తెలిసిందే. ఇక్కడ ప్రసంగించింది
పేతురే అయినా, ఇతర అపోస్తలులతో కలిసి
ఆయన నిలబడి ఈ మాటలు చెప్పినట్లు 14 వచనంలో
మనం చూడగలం.
అంతే కాదు 32వచనంలో " ఈ యేసును దేవుడు లేపెను,దీనికి
మేమందరమూ సాక్షులము" అని బహుళ పదాన్ని వాడాడు.
2. అపోస్త 11:30లో, యూదయలో కాపురమున్న
సహోదరులకు సహాయం చేయడానికి
పౌలు, బర్నబాల చేత అంతియొకయలో గల
పెద్దల యొద్దకు పంపిరి అని రాయబడింది.
3. అపొస్త 14:20-23లో దేర్బే, లుస్త్ర, ఈకొనియ,
అంతియొకయలో గల ప్రతి సంఘములో వారికి
" పెద్దలను " ఏర్పరచి, ఉపవాసముండి,
ప్రార్థన చేసి,వారు నమ్మిన ప్రభువుకు వారిని
అప్పగించారు.
పెద్దలు అనే పదం నూతన నిబంధనలో
సంఘ కాపరులను ఉద్దేశించి వాడారు.
4. అపోస్త 20 లో పౌలు తన వీడ్కోలు సమావేశానికి
ఎఫెసు నుండి "సంఘపు పెద్దలను" పిలిపించాడని
17వ వచనంలో రాయబడింది.
5. పౌలు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ 1 వచనంలో
"అధ్యక్షులను, పరిచారకులకును" అని
బహువచనంలో సంఘ నాయకులను ప్రస్తావిస్తాడు.
6. తీతుకు 1:5 లో, నేను నీకాజ్ఞాపించిన ప్రకారము
నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ
"పెద్దలను" నియమించు నిమిత్తమే నేను క్రేతులో
నిన్ను విడిచి వచ్చితిని.
ఇక్కడ పెద్దలు అనే బహువచనం వాడబడింది.
7.పేతురు కూడా తన మొదటి పత్రిక 5:1 లో
తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని,
బయలుపరచబడిన మహిమలో పాలివాడనునైన
నేను మీలోని "పెద్దలను" హెచ్చరించుచున్నాను.
"పెద్దలు" అనే పదం ఇక్కడ కూడా
సంఘ కాపరులను ఉద్దేశించి రాయబడింది.
8.యాకోబు 5: 14లో, మీలో ఎవడైనను రోగి
ఉన్నాడా అతడు "సంఘపు పెద్దలను"
పిలిపింపవలెను,
వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి
అతని కొరకు ప్రార్థన చేయవలెను.
ఇక్కడ సంఘపు పెద్దలను అని రాయబడింది
కానీ, సంఘపెద్దను పిలిపించుకుని ప్రార్థన
చేయించుకోమని లేదని గమనించాలి.
9.హెబ్రీ 13:17 లో, మీపైని నాయకులుగా
ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె
మీ ఆత్మలను కాయుచున్నారు అనే వాక్యం
నాయకుడు అని కాకుండా, నాయకులు అని
బహుళ నాయకత్వం గురించి ప్రస్తావిస్తుంది.
10. 1 పేతురు 5:3 లో కాపరులకు వ్రాస్తూ,
మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక
మందకు మాదిరిగా ఉండండి అని చెప్పిన పిదప,
5వ వచనంలో, చిన్న లారా మీరు "పెద్దలకు"
లోబడియుండుడి అని విశ్వాసులకు
ఆజ్ఞ ఇవ్వడం చూడగలం.
ఇప్పుడు బహుళ నాయకత్వం వలన కలిగే
ప్రయోజనాలను గూర్చి తెలుసుకుందాం.
1. ఒక నాయకుడే సంఘ పరిచర్య అంతా చూసుకోవడం
తలకు మించిన భారమే.ఒకరి కన్నా ఎక్కువ నాయకులు
పనిని పంచుకోవడం ద్వారా పరిచర్య చక్కగా
కొనసాగే అవకాశం ఉంటుంది.
నేటి సంఘాలలో ఒక్క పాస్టర్ గారే పాటలు పాడడం,
ప్రార్థన చేయడం, ప్రసంగం చేయడం,
విశ్వాసులను కౌన్సిలింగ్ చేయడం, దర్శించడం,
బైబిల్ స్టడీ తీసుకోవడం మొదలైన పనులు
చేయడం వల్ల పాస్టర్ గారు ఎక్కువగా
వాక్యం ధ్యానం చేసి ప్రసంగించడం
తక్కువైపోతుంది, పాస్టర్ గారు ఎక్కువగా
అలసిపోవడం జరుగుతుంది.
దీని వల్ల సంఘ కార్యక్రమాలు జరుగుతూనే
ఉన్ననూ,సంఘము (వ్యక్తులు) ఆత్మీయంగా ఎదిగే
అవకాశం తగ్గిపోతుంది.
2. ఎక్కువ మంది అలోచనకర్తలుండడం
శ్రేయస్కరం అని బైబిల్ బోధిస్తుంది.
సంఘం యొక్క క్షేమం మరియు ఆత్మీయ
అభివృద్ధికి బహుళ నాయకత్వం యొక్క
ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి.
3. బహుళ నాయకత్వం వలన జవాబుదారీతనం
కూడా ఉంటుంది.దీనివలన పాపము విషయంలో,
శోధనల విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం
ఉంటుంది.
పాస్టర్ కూడా పాపము చేసే అవకాశం ఉన్నది.
కానీ, తన శోధనలు సంఘానికి చెబితే
సంఘం నిరుత్సాహ పడుతుందనే అపోహలో
ఉండే అవకాశం ఉంది.
కొన్ని సార్లు కాపరి తన శోధనలు సంఘంతో
పంచుకొని ప్రార్థన కోరడం మంచిది.
బహుళ నాయకత్వంలో తోడి నాయకునితో
సహాయం,జవాబుదారితనం పొందుకోవచ్చు.
4. ఒకవేళ ఒక పాస్టర్ ఏదైనా శ్రమగుండా,
వ్యాధి గుండా వెళుతూ ఉన్నట్లైతే,
మరో నాయకుడు సంఘాన్ని నడిపించడానికి
అవకాశం ఉంటుంది.
5. ఒక్కరే పాస్టర్ గా ఉండడం వలన ఆ వ్యక్తే
ముఖ్య వ్యక్తిగా పేరు మరియు గుర్తింపు పొందుకొని
కొన్నిసార్లు తనకు తెలియకుండానే అధికారం
గల వాడిగా గర్వించే అవకాశం కూడా ఉండడం
వలన ఒకరి కన్నా ఎక్కువ నాయకులు
కలిసి చేసే పనిలో, ఒక వ్యక్తికి కాకుండా
నాయకత్వపు జట్టుకు ప్రాధాన్యత లభించి,
ప్రభువు పని చక్కగా కొనసాగుటకు సహాయం
దొరుకుతుంది.
అలాగని బహుళనాయకత్వంలో తరుచుగా
ప్రసంగించే, వ్యక్తులతో సంబంధాలు కట్టుకునే
పాస్టర్ చుట్టూ పరిచర్య కట్టబడదని కూడా చెప్పలేం.
కానీ, బహుళ నాయకులు ఇటువంటి వాతావరణం
కలగకుండా చూసుకోడానికి ప్రయత్నం చేయడం
మంచిది.
బహుళ నాయకత్వం పాటించకపోవడానికి
కారణాలు
A. బహుళ నాయకత్వం గురించి దేవుని వాక్యం
ఏమి వివరిస్తుందో తెలియకపోవడం చాలామంది
ఇది సంఘాల్లోపాటించకపోవడానికి ముఖ్య కారణం.
అంతే కాకుండా వారికి ముందుగా పరిచర్య
చేసిన వారు బహుళ నాయకత్వం పాటించకపోవడం
కూడా మరో కారణం.
B.సంఘాన్ని మొదలుపెట్టేది దాదాపుగా ఒక వ్యక్తే.
ప్రారంభం నుండి తనే పరిచర్య చేసిన సంఘములో
మరో వ్యక్తికి సమాన నాయకత్వం అప్పచెప్పడం
కొందరికి కష్టం.
ప్రారంభం నుండి పాస్టర్ గా ఉంటూ మరో వ్యక్తిని
నాయకత్వంలోకి ఆహ్వానించడం గర్వంతో
నిండిన హృదయానికి నచ్చదు.
కావున కొన్నిసార్లు మనమే పెద్ద అనే తత్వంతో
ఇతరులనుజట్టులోకి తీసుకోకపోయే అవకాశం
ఉన్నది.
కానీ, ఇది దేవుని పరిచర్య అని,ఇతర నాయకులు
కూడా దేవుని బిడ్డలే అని, సంఘ క్షేమం కోసం
ఇది అత్యంత అవసరమైన పరిచర్య అని
తగ్గింపు కలిగి ఉండడం మంచిది.
సంఘాన్ని మొదలుపెట్టేది, కొనసాగించేది కేవలం
కేవలం దేవుడే అని మర్చిపోవద్దు.
మరి కొన్ని కారణాలు కూడా ఉన్ననూ,
ప్రాముఖ్యంగా పై రెండు విషయాలను మాత్రమే
ఇక్కడ ప్రస్తావించదలిచాను.
బహుళ నాయకత్వం స్థానిక సంఘానికి
ఎంతో ఆశీర్వాదకరం, దేవునికి ఎంతో మహిమ
కాబట్టి ప్రతి కాపరి ఆ దిశగా అడుగులు వేసి
దేవుని సంఘ పరిచర్య కొనసాగించాలి
అని కోరుకుంటున్నాను.
( బహుళ నాయకత్వం గురించి మరింత
సమాచారం కొరకు
బైబిల్, Biblical Eldership (Alexander Strauch),
www.9Marks.org on Plurality of leadership,
www.Biblicaleldership.com చదవండి.)

Comments
Post a Comment