వరకట్నం అనగా నేమి ? వివాహ విషయములో పెళ్లికుమారుని కుటుంబానికి, పెళ్లి కుమార్తెతో పాటుగా ఆమె కుటుంబీకులు ఇచ్చే డబ్బు, వస్తు సంపదలను వరకట్నముగా నిర్వచిస్తారు. వివాహ శుభ ఘడియకు ముందు ఈ కట్న కానుకల సంప్రదింపులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతాయి. భారతదేశములో మొట్టమొదటిగా ఈ ఆచారము ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టమే. ఆ రోజుల్లో ఆడపిల్ల తండ్రి తన ఆస్తిలో కొంతభాగం బాధ్యతగా, కాబోయే పెళ్ళికూతురికి ఇచ్చేవాడు. తన కూతురు కొత్త ఇంటికి వెళ్తుందనే ఆలోచనతో ఆమెకు సహాయంగా డబ్బు, వస్తు సంపదను ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు. కాలానుగుణంగా ఈ ఆచారము ఇష్టపూర్వకమైన కానుక నుండి దురాశతో నిండిపోయి డిమాండ్ చేసే స్థాయికి దిగజారిపోయింది. సమాజమును పట్టి పీడిస్తున్న సామాజిక దురాచారమైన వరకట్న వ్యవస్థను క్రైస్తవులు కూడా పాటించడం చాలా బాధాకరం. కొందరు వరకట్నపు మూలాలను మరియు చరిత్రను ఎరుగకుండా, మరికొందరు డబ్బు మీద ఆశతో ఈ దురాచారాన్ని పాటిస్తున్నారు. క్రైస్తవ జీవితమునకు పునాదియైన బైబిల్ గ్రంథము దీనిని గూర్చి ఏమి బోధిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరతయున...