మత్తయి సువార్త 19 వ అధ్యాయంలో ధనవంతుడైన యవ్వనస్తుడు “ నిత్యజీవం పొందడానికి నేనేమీ చేయాలి ” అని ప్రభువుని అడిగినపుడు “ నీకున్నదంతా అమ్మి బీదలకివ్వు , నీవు నన్ను వెంబడించు , పరలోకంలో నీకు ధనం కలుగుతుంది ” అని క్రీస్తు చెబుతాడు . ఇక్కడ ప్రభువు , బీదలకు ప్రధానంగా సహాయం చేయమనే ఉద్దేశంతో ఆ మాట చెప్పడం లేదు , ఆ ధనవంతుడైన యవ్వనస్తునికి గల ప్రధాన సమస్య దాన ధర్మాలు చేయకపోవడం కూడా కాదు. ధనవంతుడైన యవ్వనస్తుడు తనకున్న ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం సమస్య. స్వార్థం ఆయన సమస్య. ఆయనకున్న సంపదే ఆయన సమస్య. దేవునికి ఆ వ్యక్తికి మధ్యగల అడ్డుగోడ ఆ వ్యక్తికి గల అధిక ధనమే. అందుకే, ప్రభువు దానిని అమ్మేసి తనను వెంబడించమని ఆజ్ఞాపించాడు. ఆ ధనవంతుడైన యవ్వనస్తుడు ఆ పని చేయలేక వెళ్ళిపోయాడు. క్రైస్తవులందరూ తమకున్న ఆస్తి మొత్తం అమ్మేసి తనను వెంబడించమని కూడా ప్రభువు ఇక్కడ చెప్పడం లేదు. ప్రభువు స్థానంలో ధనాన్ని పెట్టి, ప్రభువుని పక్కనబెట్టి స్వార్థంగా జీవించకూడదు అని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. మనకున్న ధనం దేవునికి మనకి మధ్య అడ్డుగోడలా నిలబడి మనం దేవుణ్ణి విడిచిపెట్టేలా చేస్తుంది....