ఇన్ని బాధలు పడుతున్నాను, ఎక్కడున్నావు దేవా? ఇంతగా శ్రమలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఏమైపోయావు దేవా? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మనందరం వేసినవారమే. మన కష్టాల్లో మొదటిగా ప్రశ్నించేది దేవున్నే. అంతా సాఫీగా సాగిపోతున్నపుడు రాని ఈ ప్రశ్నలు, శ్రమలు పలకరించగానే పుంఖాను పుంఖాలుగా పుట్టుకొస్తుంటాయి. కొందరు సూటిగా ప్రశ్నించక పోయినా ప్రభువా, అసలు మా గూర్చి నీకు చింత లేదా అనే మాటలను మాటి మాటికీ నెమరు వేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఈ ప్రశ్నలకు బైబిల్ ఎప్పుడో జవాబులు ఇచ్చేసింది. ఇక్కడ సమస్య జవాబులు దొరక్క కాదు, జవాబులను అంగీకరించి, అన్వయించుకోకపోవడమే. నిజమా అని మీరు ఆశ్చర్యపడేలోపు మనుష్యులు శ్రమల్లో ఉన్నపుడు దేవుడు ఎక్కడ ఉంటాడో,ఎక్కడ ఉన్నాడో బైబిల్ నుండే చూపించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు దేవునికి గల ఒక ప్రాముఖ్యమైన గుణ లక్షణం గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఆత్మ.అంటే ఆయనకు శరీరం ఉండదు. ఈ ఆత్మ అయిన దేవుడు అన్ని ప్రదేశాల్లో తన ఉనికిని పూర్తిగా కలిగి ఉంటాడు. అందుకే దేవుడు సర్వవ్యాపి అని అంటుంటారు. సర్వవ్యాపి అయిన దేవుడు, మనుష్యులు శ్రమల గుండా వెళ్లనప్పుడు ఎక్కడ ఉంటాడో, అదే మనుష్...