నేటి దినాలలో కొంతమంది ప్రభువును కొత్తగా విశ్వసించి, ఆ పిదప తమకు తాము సంఘకాపరులుగా ప్రకటించుకుంటూ స్థానిక సంఘాలను మొదలుపెడుతున్నారు. పరిచర్య చేయాలనే మంచి ఆశతోనే వారు సంఘాలను స్థాపిస్తున్నను, దేవుని వాక్యము కొత్తగా ప్రభువును నమ్ముకున్న వ్యక్తి సంఘ కాపరిగా ఉండడానికి ఒప్పుకుంటుందా లేదా చూసే ప్రయత్నం చేద్దాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం 1-7 వచనాలలో సంఘ కాపరికి ఉండాల్సిన లక్షణాలను విశదీకరించాడు. 6వ వచనంలో "అతడు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు " అని పౌలు చెబుతున్నాడు. అనగా, యేసు ప్రభువును కొత్తగా అంగీకరించి మరియు స్థానిక సంఘమునకు కొత్తగా అంటుకట్టబడిన వ్యక్తి సంఘకాపరిగా ఉండడానికి వాక్యం అనుమతించట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పౌలు ఈ విధమైన నియమం విధించాడు ? కొన్ని సంగతులు ఇక్కడ విశదీకరించే ప్రయత్నం చేస్తాను . 1.కొత్తగా ప్రభువును విశ్వసించిన వ్యక్తికి లోతైన వాక్యపు సత్యములు తెలియదు. అవి తెలుసుకోడానికి చాలా సమయం పడుతుంది. సంఘముకు వాక్యమును బోధించవలసిన బాధ్యత గల కాపరి, ముందుగా దేవుని వాక్యంనుండి నేర...